Asianet News TeluguAsianet News Telugu

ఏ అధికారంతో ఎస్ఈసీగా ఉన్నారు... నిమ్మగడ్డ రమేశ్‌పై హైకోర్టులో కో వారెంటో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలైంది

quo warranto petition filed against sec nimmagadda ramesh kumar in ap high court
Author
Amaravathi, First Published Jun 9, 2020, 2:54 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసీ నియామకం కేబినెట్ సిఫారసు మేరకు జరగడానికి వీల్లేదని, పూర్తిగా రాష్ట్ర గవర్నర్ విచక్షణ మేరకే జరగాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నియమిస్తూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.11ను కొట్టేయాలని కోరుతూ గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన సంగం శ్రీకాంత్ రెడ్డి కో వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో, ఏ అధికారంతో నిమ్మగడ్డ ఎస్ఈసీగా కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలంటూ శ్రీకాంత్ హైకోర్టును అభ్యర్ధించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా ముఖ్య కార్యదర్శి స్థాయికి తక్కువ కానీ అధికారిని ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ నియమించాలంటూ ఏపీ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 200 (2)ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు దీనిని రద్దు చేయాలని శ్రీకాంత్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

Also Read:జూన్ 10న సుప్రీంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణ

అలాగే ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వర్తించకుండా నిమ్మగడ్డను నియంత్రించాలంటూ ఆయన న్యాయస్థానానికి విజ్ఙప్తి చేశారు. 

కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పై ఈ నెల 10వ తేదీన విచారణ చేపట్టనుంది.  

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. 10వతేది మధ్యాహ్నం 12గంటల నుంచి ధర్మాసనం కేసుల విచారణను ప్రారంభిస్తుంది. 

కేసుల జాబితాలో ఈ కేసు నెంబర్ 11. ఇకపోతే...  ఈ విషయంలో జస్టిస్‌ కనగరాజ్‌ను ప్రతివాదిగా చేర్చడంతో పాటు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన ఇతర లోపాలను రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఇప్పటికే సరిదిద్దారు. 

Also Read:తొందరపడి... అప్పుడు: నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి అందుకే....

కాగా, ఈ కేసులో నిర్ణయం తీసుకునేముందు తమ వాదన కూడా వినాలంటూ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, టీడీపీ నేత వర్ల రామయ్య, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలీ, బీజేపీ నేత, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌, న్యాయవాది కే జితేంద్రబాబు ఇప్పటికే కేవియెట్‌ పిటిషన్ లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సును హై కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్సును కొట్టేయడంతో కనగరాజ్ నియామకం, రమేష్ కుమార్ తొలగింపు చెల్లవని ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios