ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హాట్ హాట్ గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సును హై కోర్టు కొట్టివేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమారే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా కొనసాగుతారు అని పేర్కొంది. 

దానితో ఆయన తాను చేరుతున్నాను అని చెప్పడం, ఆ వెంటనే ఒక ఆదేశాన్ని జారీ చేయడం, రాత్రికి ఏజి ప్రెస్ మీట్ కి పిలిచి ఆయనే ఎలా ప్రకటించుకుంటారు అనడం, ఆ వెంటనే ఆయన ఇచ్చిన ఆర్డర్ ని వెనక్కి తీసుకోవడం, ఇక తాజాగా ఇప్పుడు రమేష్ కుమార్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేమరికొన్ని రోజులు చి చూస్తాను అని చెబుతున్నారు. 

ఈ అంతటిని చూస్తుంటే ఒక రాజకీయ రాజ్యాంగ చదరంగంలా అనిపించక మానదు. ఈ మొత్తం వ్యవహారంలో తమది అంటే తమదే ఒప్పు అని ఇటు రమేష్ కుమార్, అటు ప్రభుత్వం ప్రకటించుకుంటున్న నేపథ్యంలో సామాన్య మానవుడికి మాత్రం అసలు ఏమి జరుగిడుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. 

ఈ అంతటిని అర్థం, చేసుకోవాలంటే.... మనం హై కోర్టు ఆర్డర్లో ఏముందో తెలుసుకోవాలి. హైకోర్టు తన ఉత్తర్వుల్లో ఆర్డినెన్సును కొట్టేసింది. దానితో ఇటు కనగ రాజ్ నియామకం చెల్లదు, అటు రమేష్ కుమార్ తొలిగింపు కూడా చెల్లదు. 

ఇక్కడిదాకా బాగానే ఉంది. రమేష్ కుమార్ ని పునర్నియమించమని చెప్పింది హై కోర్టు. కానీ రమేష్ కుమార్ మాత్రం తనంతట తానే వచ్చి చేరుతున్నాను అని చెప్పారు. ప్రభుత్వం తరుపున ఏజీ మాట్లాడుతూ రమేష్ కుమార్ తొందరపడ్డారు అని అన్నారు. 

వాస్తవానికి రమేష్ కుమార్ కి జరిగింది అన్యాయమే. కోర్టు కూడా దాన్ని అంగీకరించి, ఆయన హక్కులను కాపాడుతూ ఆయనను తిరిగి నియమించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కానీ రమేష్ కుమార్ మాత్రం ప్రభుత్వం ఆ విషయంపై ఎటువంటి ప్రకటన చేయకముందే, సుప్రీమ్ కోర్టుకి వెళ్తామని చెప్పిన తరువాత రమేష్ కుమార్ ఇలా తాను చేరబోతున్నానంటూ చెప్పడం నిజంగా ఆశ్చర్యకరం. 

సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆయన ఇలా రూల్స్ ను మరిచారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు. హై కోర్టు తీర్పు తర్వాత సుప్రీమ్ కి వెళ్తామని ప్రభుత్వ వర్గాలు బాహాటంగానే చెప్పాయి. వారికి ఆ హక్కు కూడా ఉంది. తీర్పు తమకు అనుకూలంగా రానప్పుడు, దానిపై అపీల్ కి వెళ్లే అవకాశం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది.  

అంతలోనే ఏదో కొంపలు మునిగిపోయినట్టు రమేష్ కుమార్ గారు ఉత్తర్వులను జారీచేయడం మాత్రం తొందరపాటు చర్యే అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం తాత్సారం చేస్తే అప్పుడు ప్రభుత్వం అనవసర తాత్సారం చేస్తుందని పేర్కొంటూ కోర్టుకి వెళితే బాగుండేది. నిజంగా తాత్సారం జరిగితే కోర్టు ధిక్కరణ కింద అధికారులను చివాట్లు పెట్టి ఆయనకు ఆయన పదవిని తిరిగి అప్పగించేది.  

ఆయన కోర్టుకి కూడా వెళ్లకుండా ఇలా తాను చేరుతానంటూ ప్రకటించడం పట్ల ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తుంది. రమేష్ కుమార్ అందుకోసమే ఇప్పుడు మరికొన్ని రోజులపాటు ఎదురు చూస్తాను అని అంటున్నారు.

ప్రభుత్వం ఇప్పుడు సుప్రీమ్ కోర్టుకి వెళ్లేందుకు యోచన చేస్తుంది. సుప్రీమ్ లో ఎలాగైనా హై కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని ప్రభుత్వం బలంగా భావిస్తోంది. చూడాలి రానున్న రోజుల్లో ఈ రాజకీయం ఇంకెంత రంజుగా మారుతుందో....!