విజయనగరం: ఇప్పటికే పూసపాటి వంశీయుల ఆధ్వర్యంలో నడిచే మాన్సాస్ ట్రస్ట్ విషయంలో వివాదం కొనసాగుతుండగా జగన్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం ఆ వంశీయుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే  మహారాజా(ఎంఆర్) కాలేజీని ప్రైవేటికరించాలన్న వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని పూసపాటి వంశీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై తాజాగా మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు కుమార్తె పూసపాటి ఊర్మిళ గజపతి రాజు స్పందించారు. 

ప్రఖ్యాత మహారాజా కాలేజీని ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరడానికి సంవత్సరం కాలంగా సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా లభించడం లేదన్నారు.  తన  తాత, తండ్రుల పేరును చెడగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎంతో చరిత్ర కలిగిన ఈ కళాశాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధాకరమన్నారు. ఈ కాలేజీలో చదివిన వారు ప్రస్తుతం దేశ విదేశాల్లో మంచి స్థానాల్లో వున్నారన్నారు. ఈ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని తాము అంగీకరించబోమని... దయచేసి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  ఊర్మిల కోరారు.