భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి రాయలసీమకు ఇన్చార్జిగా నియమితులు కానున్నారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయ్. అందుకనే పురంధేశ్వరి తరచూ రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు సమాచారం. రాయలసీమలోని నీటి పారుదల ప్రాజెక్టులపై అధ్యయనం పేరుతో కొంతకాలంగా పర్యటిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి రాయలసీమకు ఇన్చార్జిగా నియమితులు కానున్నారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయ్. అందుకనే పురంధేశ్వరి తరచూ రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పరంగా జాతీయ నాయకత్వం ఇప్పటికే కేంద్రమంత్రిని ఇన్చార్జిగా నియమించినప్పటికీ పార్టీ వ్యవహారాలు చూసుకోవటానికి మరో సీనియర్ నేత అవసరమని నాయకత్వం భావించిందట. ఎన్నికలకు కూడా ఎంతో దూరం లేదు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉంటుందో లేదో తేలలేదు. దాంతో ఎందుకైనా మంచిదని ఓ నేతను ఇన్చార్జిని నియమిస్తే మంచిదని పార్టీ భావించిందట.

ఇందులో భాగంగానే పురంధేశ్వరిని రాయలసీమకు ఇన్చార్జిగా నియమించే అవకాశాలున్నాయని పార్టీ నేతలంటున్నారు. పోయిన ఎన్నికలో ఈ కేంద్ర మాజీ మంత్రి కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంటుకు పోటీ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపుంది. అంతేకాకుండా కేంద్రంలో మంత్రిగా పనిచేసినంత కాలం మంచి వక్తగా పేరుంది. కాబట్టి పార్టీ పై స్ధాయి నాయకత్వంతో పాటు క్రిందిస్ధాయి శ్రేణుల్లో కూడా మంచి సంబంధాలే కలిగి ఉన్నారు.

ఆమధ్య రాయలసీమ జిల్లాలో కరువు పరిస్ధితిపైన కూడా పురంధేశ్వరి అధ్యయనం పేరుతో విస్తృతంగా పర్యటించారు. ఇపుడు కూడా రాయలసీమలోని నీటి పారుదల ప్రాజెక్టులపై అధ్యయనం పేరుతో కొంతకాలంగా పర్యటిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. తన పర్యటనలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన ఎంఎల్ఏలతో పాటు స్ధానిక ప్రజాప్రతినిధులను కూడా కలుస్తున్నారు. ప్రధానంగా అనంతపురం, కడప జిల్లాలపై దృష్టి సారించారు. ఇవన్నీ చూసిన తర్వాత రాయలసీమకు పురంధేశ్వరిని ఇన్చార్జిగా నియమించటం ఖాయమనే అంటున్నారు. దానికితోడు ఇటీవల పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ‘‘వచ్చే ఎన్నికలో అనంతపురం జిల్లా నుండే తాను పార్లమెంటుకు పోటీ చేస్తా’’ అని చెప్పటంతో ప్రచారానికి మరింత మద్దతు లభించినట్లైంది.