రసవత్తరంగా పులివెందుల పాలిటిక్స్ ... వైసిపి గూటికి వైఎస్ జగన్ ప్రత్యర్థి
'వై నాట్ పులివెందుల' నినాదంతో 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న టిడిపికి బిగ్ షాక్ తగిలేలా వుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ పై పోటీచేసిన టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసిపిలోకి జంప్ అవుతున్నారు.
కడప : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటికే అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి-జనసేన కూటమి తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. తమ బలాన్ని పెంచుకోవడమే కాదు ప్రత్యర్థిని దెబ్బతీయడం ద్వారా విజయావకాశాలు మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇందుకోసం పార్టీలన్ని చేరికలను ప్రోత్సహించడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వైసిపికి కంచుకోట, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా పులివెందులలో టిడిపికి షాక్ తగిలేలా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలో జగన్ ప్రత్యర్థి, టిడిపి సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి వైసిపి కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పులివెందుల టిడిపి అభ్యర్థిగా పోటీచేసారు సతీష్ రెడ్డి. కానీ వైసిపి చీఫ్ వైఎస్ జగన్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసారు. దీంతో ఈసారి 'వై నాట్ పులివెందుల' నినాదంతో సొంత నియోజకవర్గంలో వైఎస్ జగన్ ఓడించాలని టిడిపి భావిస్తోంది. అందులో భాగంగానే సతీష్ రెడ్డి కంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనుకుని బిటెక్ రవిని పులివెందుల టికెట్ కేటాయించింది.
అయితే ఈసారి కూడా పులివెందుల టికెట్ తనకే దక్కుతుందని ఆశించిన సతీష్ రెడ్డిని టిడిపి అధిష్టానం నిర్ణయం అసంతృప్తికి గురిచేసింది. దీంతో ఎన్నోఏళ్ల టిడిపి అనుబంధాన్ని తెంచుకుని వైసిపిలో చేరేందుకు ఆయన సిద్దమయ్యారు. ఇప్పటికే వైసిపిలోని కీలక నాయకులతో చర్చించిన సతీష్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ పై భరోసా దక్కినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం వైసిపిలో చేరనున్నారు... స్వయంగా సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా సతీష్ రెడ్డి కండువా కప్పుకోనున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో ఈ చేరిక కార్యక్రమం వుండనుందని వైసిపి వర్గాల సమాచారం.
మాజీ మంత్రి పుల్లారావుకు షాక్ ... తనయుడికి 14 రోజుల రిమాండ్
సతీష్ రెడ్డి వైసిపిలో చేరడం టిడిపికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. గత రెండు (2014,2019) అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన నాయకుడని, ఓడించలేమని తెలిసినా వైఎస్ జగన్ పై పోటీచేసాడు సతీష్. వైసిపి అధినేతను ఢీకొని ఓడిపోయినప్పటికి సతీష్ రెడ్డికి టిడిపి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అంతేకాదు శాసనమండలి వైస్ ఛైర్మన్ పదవిని కూడా ఇచ్చింది.
అయితే గత కొంతకాలంగా బిటెక్ రవి (మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) పులివెందుల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట కడపలో దివంగత వైఎస్ వివేకానందరెడ్డిపై విజయం సాధించి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నాడు. ఆ తర్వాత వైసిపి అధికారంలోకి వచ్చినా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినా తన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు బిటెక్ రవి. దీంతో ఈసారి సతీష్ రెడ్డిని కాకుండా బిటెక్ రవిని వైఎస్ జగన్ పై పులివెందుల బరిలోకి దింపారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.