మాజీ మంత్రి పుల్లారావుకు షాక్ ... తనయుడికి 14 రోజుల రిమాండ్
చిలకలూరిపేట టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఎన్నికల వేళ షాక్ తగిలింది. ఆయన తనయుడు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేయగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
విజయవాడ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. గురువారం సాయంత్రం శరత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అర్థరాత్రి విజయవాడ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. హైడ్రామా తర్వాత శరత్ ను న్యాయమూర్తి నివాసానికి తరలించారు పోలీసులు. అదే అర్ధరాత్రి రెండుగంటల వాదోపవాదం తర్వాత పోలీసులతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు.
అయితే శరత్ ను విజయవాడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్లు తెలిసి జడ్జి క్వార్టర్స్ వద్దకు టిడిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు. రాజకీయ కక్షసాధింపు కోసమే శరత్ పై అక్రమ కేసులు పెట్టారని... వెంటనే అతడిని విడిచిపెట్టాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలో న్యాయమూర్తి నివాసంవద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు.
ఇక శరత్ తండ్రి పుల్లారావుతో పాటు టిడిపి సీనియర్లు దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్ రావు, బోడె ప్రసాద్, కొల్లు రవీంద్ర, పట్టాభిరాం, మాణిక్యాలరావు కూడా జడ్జి నివాసానికి చేరుకున్నారు. శరత్ తరపున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. అయితే శరత్ ను విడిపించేందుకు ఆయన ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం శరత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.
వీడియో
ఇదిలావుంటే శరత్ అరెస్ట్ తర్వాత హైడ్రామా కొనసాగింది. తన కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తరలించారో తెలియడం లేదని పుల్లారావు ఆందోళన వ్యక్తం చేసారు. కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులను సంప్రదించినా ఆఛూకీ చెప్పడంలేదన్నారు. తన కొడుకుకు ఏం జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహించాల్సి వుంటుందని పుల్లారావు హెచ్చరించారు.
ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్ .. అధికార పార్టీ కుట్రేనంటూ భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
టిడిపి నాయకులు కూడా పుల్లారావు తనయుడి అరెస్ట్ ను ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కొడుకును అరెస్ట్ చేసి పుల్లారావును వేధించాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆరోపించారు. వెంటనే శరత్ ను విడుదల చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
శరత్ పై కేసేమిటి..?
మాజీ మంత్రి తనయుడైన ప్రత్తిపాటి శరత్ 'ఆవేక్షా కార్పోరేషన్' అనే కంపనీని నడుపుతున్నాడు. అయితే అతడు నిబంధనలకు విరుద్దంగా కంపనీని నడుపుతున్నాడని... భారీగా జీఎస్టి ఎగవేసాడని సంబంధిత అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. నిధులు మళ్లించడంతో పాటు పన్ను ఎగవేసారనే అభియోగాలపై ఐపిసి 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 సెక్షన్ల కింద శరత్ పై కేసులు నమోదుచేసారు. శరత్ తో పాటు మొత్తం ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి... వీరిలో పుల్లారావు భార్య, బావమరిది పేర్లు కూడా వున్నాయి.