కేంద్ర-రాష్ట్రాల మధ్య ‘ప్రచార’ యుద్దం

కేంద్ర-రాష్ట్రాల మధ్య ‘ప్రచార’ యుద్దం

రాష్ట్రంలో అమలవుతున్న తన పథకాలపై కేంద్రమే ప్రచారం మొదలుపెట్టాలని నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఏపి-కేంద్రానికి మధ్య జరుగుతున్న పథకాల వార్ తో కేంద్రానికి జ్ఞానోదయం అయినట్లుంది. ఎందుకంటే, రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాల్లో రాష్ట్రం అమలు చేసే పథకాలతో పాటు కేంద్ర పథకాలు కూడా ఉంటాయి.

అంతేకాకుండా రాష్ట్రం అమలు చేసే అనేక పథకాల్లో చాలా వాటికి కేంద్రం నుండి నిధులు కూడా మంజూరవుతుంటాయి.

అందుకనే ప్రజల కోసం అమలయ్యే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో కేంద్ర, రాష్ట్ర పథకాలు కలిసే ఉంటాయన్న విషయం తెలిసిందే. అంటే జనాలకందే అనేక పథకాల్లో కేంద్ర, రాష్ట్రాల వాటా కలిసే ఉంటుంది.

అయితే, ఏ రాష్ట్రప్రభుత్వం కూడా ఇది కేంద్రప్రభుత్వం నిధులతో అమలయ్యే పథకమని, ఇది రాష్ట్రప్రభుత్వం నిధులతో అమలయ్యే పథకమని చెప్పదు.

ప్రజలకందే సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ రాష్ట్రమే అమలు చేస్తుంది కాబట్టి మెజారిటీ జనాలకు రాష్ట్రమే అమలు చేస్తుందని అనుకుంటారు. అదే పద్దతిలో ఏపిలో కూడా గడచిన మూడున్నరేళ్ళుగా జరుగుతోంది.  అమలవుతున్న పథకాలన్నీ తనవే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు.

24 గంటల విద్యుత్ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం, ఫించన్లు, గృహనిర్మాణ పథకాలు, రేషన్బీమా తదితరాల్లో కేంద్ర వాటానే ఎక్కువ.

కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నపుడు పథకాల ప్రచారంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సోనియాగాంధిల ఫొటోలుండేవి.

దాంతో జనాల్లో స్పష్టమైన అవగాహనుండేది. ఇపుడు కూడా పథకాల్లో ప్రధాని ఫొటోలుంటే సరిపోయేది. కానీ ఎక్కడ చూసినా చంద్రబాబు లేదా లోకేష్ ఫొటోలు మాత్రమే కనబడుతున్నాయి. ఇంతకాలం అలానే జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబుకు కేంద్రానికి చెడిందో అప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి.

దానికితోడు బిజెపి నేతలు చేసిన ఫిర్యాదుతో కేంద్రానికి చంద్రబాబుపై మండింది.

ప్రస్తుతం కేంద్ర-చంద్రబాబు మధ్య ప్రచ్ఛన్న యుద్దమే నడుస్తోంది. దానికితోడు సాధారణ ఎన్నికలు తరుముకొస్తున్నాయ్. అందుకనే కేంద్రం కళ్ళు తెరిచింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై నేరుగా కేంద్రమే ప్రచారం చేసుకోవాలని నిర్ణయించింది.

క్యాబినెట్ సెక్రటరీ నేరుగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. 7 పథకాలపై 21 వేల గ్రామాల్లో సభలు పెట్టాలని చెప్పారు. అవసరమైన ప్రచార సామగ్రిని కేంద్రమే పంపాలని నిర్ణయించింది. ప్రచారం ఎలా జరుగుతోందో చూసేందుకు ప్రతీ జిల్లాకు ఓ నోడల్ అధికారిని నియమించనున్నది. దాంతో కేంద్ర, చంద్రబాబు మద్య ప్రచార యుద్ధం మొదలవ్వబోతోందన్న విషయం అర్ధమైపోతోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos