ఫిరాయింపు ఎంఎల్ఏను తరిమేసిన జనాలు

First Published 11, Jan 2018, 12:55 PM IST
Public warned defection MLA in the janmabhoomi programme
Highlights

ఎంఎల్ఏలకు జనాలు చుక్కలు చూపిస్తున్నారు.

ఎంఎల్ఏలకు జనాలు చుక్కలు చూపిస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం మొదలైన దగ్గర నుండి మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు అధికారులను జనాలు ఎక్కడికక్కడ నిలదీస్తున్న సంగతి అందరూ చూస్తున్నదే. జనాల నిలదీత టిడిపి నేతలకే కాదు ఫిరాయంపు ఎంఎల్ఏలకూ తప్పటం లేదు.

తాజాగా కర్నూలు జిల్లాలోని కోడుమూరులో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో జనాలు ఎంఎల్ఏ మణిగాంధితో పాటు కలెక్టర్ ను కూడా గట్టిగా తగులుకున్నారు. పోయిన జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన హామీల సంగతి ఏమైందని నిలదీసారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కావటం లేదంటూ మండిపడ్డారు.

నియోజకవర్గ అభివృద్ధి పేరుతో వైసిపి తరపున గెలిచిన మణిగాంధి టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, పార్టీ ఫిరాయంచటం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప మరేమీ లేవని వైసిపి ఆరోపిస్తోంది. సరే, ఏదేమైనా ఎంఎల్ఏ టిడిపిలోకి ఫిరాయించినా అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఏమీ జరగటం లేదు. ఆ విషయాన్నే జనాలు ఈరోజు ఎంఎల్ఏ, కలెక్టర్ ను నిలేసారు.

టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత కూడా నియోజకవర్గంలో గానీ తమ గ్రామం పూడూరులో గానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేయటం లేదని గాంధిని జనాలు నిలదీసారు. దాంతో ఎంఎల్ఏ జనాలకు ఏమీ సమాధానం ఇవ్వలేక ఎదురుతిరిగారు. దాంతో జనాలు మరింత రెచ్చిపోయారు. కార్యక్రమం వేదిక మీద నుండి గాంధిని దింపేసారు. ఎంఎల్ఏ ఎంత మొత్తుకుంటున్నా జనాలు అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. సమస్యలు పరిష్కరించే వరకూ తమ గ్రామంలోకి రావద్దని తెగేసి చెప్పారు. దాంతో చేసేది లేక కలెక్టర్ తో పాటు మణిగాంధి కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు.

loader