ప్రజలకు మళ్ళీ చుక్కలు కనబడుతున్నాయి. బ్యాంకుల్లో అవసరానికి తగ్గ డబ్బు ఇవ్వటంలేదు. ఏటిఎంలు ఖాళీ అయిపోయాయి. దాంతో జనాలకు మళ్ళీ చుక్కలు కనబడుతున్నాయి. బ్యాంకుల్లో నిలబడలేక, ఏటిఎంల చుట్టూ తిరగలేక జనాలు నానా అవస్తలు పడుతున్నారు.

రాష్ట్రంలోని చాలా చోట్ల బ్యాంకుల్లో కానీ ఏటిఎంల్లో కానీ డబ్బులు లేకపోవటతో మళ్ళీ డీమానిటైజేషన్ రోజులను తలపిస్తున్నాయి. అందుకే చాలా బ్యాంకుల ఏటీఎంలు మూతపడ్డాయి. కొన్నిచోట్ల 'నో క్యాష్‌' బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగదు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగరాల్లోనే ఇటువంటి పరిస్థితి ఉంటే పల్లెల్లో పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఏదైనా బ్యాంకు ఏటీఎంలో నగదు పెట్టారని తెలిస్తే చాలు వినియోగదారులు అక్కడ పరుగులు తీస్తున్నారు. రాజధాని నగరమైన విజయవాడలో బుధవారం పరిశీలిస్తే ప్రధాన బ్యాంకుల ఏటీఎంల్లో ఎక్కడా నగదు లేదు. బ్యాంకుల్లో కూడా రూ.10,000 ల కన్నా ఎక్కువ నగదు ఇవ్వడం లేదు. దాంతో ప్రజల్లో ఆగ్రహం మొదలైంది.  

ఇదే విషయమై చంద్రబాబునాయుడు కేంద్రం, రిజర్వు బ్యాంకుకు లేఖ రాసారు. రాష్ట్రంలోని తక్షణవసరాలను తీర్చటానికి కనీసం రూ. 5 వేల కోట్లు పంపాల్సిందిగా కోరారు. మరి, కేంద్రం, ఆర్బిఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.