ఫిరాయింపు ఎంఎల్ఏకి దారుణ పరాభవం జరిగింది. వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో 22 మంది టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే కదా? పార్టీ ఫిరాయించిన దగ్గర నుండి కొందరు తమ నియోజకవర్గాల్లో బాగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లోకి ఫిరాయింపు ఎంఎల్ఏలు రాగానే వారిని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అటువంటి ఘటనే తాజాగా ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఎంఎల్ఏ ముత్తముల అశోక్ కూడా టిడిపిలోకి ఫిరాయించిన బాపతే లేండి. ముఖ్యమంత్రి రూపొందించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎంఎల్ఏ అశోక్ పాల్గొన్నపుడు దారుణమైన అవమానం జరిగింది. ఓ ఫిరాయింపు ఎంఎల్ఏపై కోడిగుడ్లతో దాడి జరగటం ఇదే మొదటిసారి. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.  కార్యక్రమంలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి ఎంఎల్ఏ అర్ధవీడు మండలంలోని వెలగలపాయ గ్రామానికి చేరుకున్నారు.  

కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఎంఎల్ఏపై కోడిగుడ్లు వచ్చి పడ్డాయి. అర్ధరాత్రి కావటంతో జనాల్లో కోడిగుడ్లు విసిరింది ఎవరో ముందు అర్ధం కాలేదు.  ఒక్కసారిగా తనపై కోడిగుడ్లు వచ్చి పడటంతో ఏం జరుగుతోందో అర్దంకాక ఎంఎల్ఏ భయపడ్డారు. అయితే పక్కనున్న వారు పరిస్ధితిని గమనించి కోడిగుడ్లను అడ్డకున్నారు. ఎంఎల్ఏపై కోడిగుడ్లు పడటంతో కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మొత్తానికి ఎంఎల్ఏపై కోడిగుడ్లను విసిరేసిందెవరో ఎంఎల్ఏ మనుషులు గుర్తించి వారిపైకి దాడి చేశారు. వారిపై కేసులు నమోదు చేయాలని ఎంఎల్ఏ ఆదేశాలతో పోలీసులు  వెంటనే రంగంతోకి దిగారు.