శ్రీకాకుళం: ఎట్టకేలకు సైకో కిల్లర్ పోలీసులకు చిక్కాడు. మూడు రాష్ట్రాల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించడంతో వారిని హత్య చేశాడు. నాలుగేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు అతన్ని శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేశారు ఎస్పీ అమ్మిరెడ్డి అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

ఒడిశాలోని గజపతి జిల్లా గండాహతి పంచాయతీ పలకభద్ర గ్రామానికి చెందిన సవర రమేష్ (55) భీంపురం గ్రామానికి చెందన సంపను వివాహం చేసుకని ఇల్లరికం వెళ్లాడు. 2016 అక్టోబర్ 16వ తేదీన భీంపురంలో దోసేటి దమయంతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి తెలంగాణకు పారిపోయాడు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని శ్రీలక్ష్మీ తులసి ఆగ్రో పేపర్ మిల్లులు కూలీగా చేరి పనిచేయసాగాడు. అక్కడ పనిచేస్తున్న ముచ్చిక కోసమ్మపై 2017 నవంబర్ 18వ తేదీన అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ఎదురుతిరగడంతో ఆమెను హత్య చేసిన అక్కడి నుంచి పారిపోయాడు. 

ఆ తర్వాత గుంటూరు జిల్లా గోకినకొండకు పారిపోయాడు. అక్కడ చేపల చెరువు వద్ద పని చేయడం ప్రారంభించారు. అక్కడ పనిచేస్తున్న బొమ్మలి లక్ష్మితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె చెల్లెలు జయంతి వితంతువు. ఆమెకు ఇంటి నిర్మాణానికి రమేష్ రూ.30 వేలు అప్పు ఇచ్చాడు. తర్వాత స్వగ్రామానికి వెళ్లిపోయిన జయంతిని మాయమాటలు చెప్పి 2019 డిసెంబర్ 16వ తేదీన మెళియాపుట్టి మండలం పట్టుపురం గ్రామానికి రప్పించి ఆమెపై అత్యాచారానికి ప్రయత్ించాడు. 

ఆమె ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేసి ఆఫ్ షోర్ కాలువలో పడేసి పారిపోయాడు. తాజాగా తమిళనాడుకు పారిపోతుండగా సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా సారవకోట ఎస్ఐ అతన్ని పట్టుకున్నాడు.