ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి పెద్ద మనసు చేసుకోవటంతో ఓ పాఠశాలకు కొత్త భవనమొచ్చింది. విశాఖపట్నం జిల్లా కశింకోటలోని డీపీఎన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నాలుగో తరగతికి చాలా కాలంగా సరైన భవనాలు లేవు.

స్వాతంత్య్రం కోసం మొదటిసారి  సిపాయిల తిరుగుబాటు జరిగిన 1857వ సంవత్సరంలోనే ఇక్కడి పాఠశాల ప్రారంభమైంది. అయితే భవనాలు పాతవై పాడుపడిపోయాయి. దానికి తోడు ఆమధ్య వచ్చిన హుద్ హుద్ వల్ల ఉన్న భవనాలు కూడా నేలమట్టమైపోయాయి.

సరైన భవనాలు లేని కారణంగా వేరే  పాఠశాలలో తరగతులు నిర్వహించవలసి వస్తోంది. దాంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  విషయం తెలుసుకున్న రాజమౌళి పాఠశాలల్లో భవనాలు నిర్మించేందుకు కలెక్టర్ ను సంప్రదించారు.

కలెక్టర్‌ సూచనల మేరకు ఇక్కడి పాఠశాలలో భవన నిర్మాణానికి ముందుకు వచ్చి సుమారు రూ. 40 లక్షలు అందించారు. దాంతో నాలుగు తరగతి గదులతో నిర్మించిన భవనం పూర్తై   ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. 

ఈ భవనానికి రాజమౌళి తన తల్లి రాజనందిని పేరుతో  ‘జనని రాజనందిని’గా నామకరణం చేశారు. 

ఎలాగూ కొత్త భవనాలు కట్టారు కాబట్టి ఆధునిక వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఈ భవనంలోనే వర్చువల్‌ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా నిధులను సమకూర్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పాఠాలను ఈ తరగతుల ద్వారా విద్యార్థులు వినడానికి, అక్కడ ఉండే ఉపాధ్యాయులతో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలగనుంది.