కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే  అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కరువుపై కవాతు కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

కర్నూలుకు చెందిన నలుగురు కార్యకర్తలు అనంతపురం కవాతుకు వెళ్లారు. కవాతులో పాల్గొని మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోబోతారు అనుకుంటుండగా ఓ ప్రవేట్ బస్సు వారి పాలిట మృత్యువుగా మారింది. డోన్ సమీపంలో వచ్చేసరికి జనసేన కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురుకార్యకర్తలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 

మృతులు వెల్దుర్తి మండలం గోవర్థనగిరికి చెందిన హనుమన్న, గోవింద్, డోన్ మండలం ధర్మవరానికి చెందిన మధుగా గుర్తించారు. మరోక మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే డ్రైవర్ మల్లికార్జుజనరావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

ప్రమాద విషయం తెలుసుకున్న జనసేన అధినేత చలించిపోయారు. నలుగురు మరణించారని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్థానిక జనసేన కార్యకర్తలతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు చూడాలని ఆదేశించారు.