చంద్రబాబుకు హౌస్ కస్టడీ అవసరం లేదన్న జైళ్ల శాఖ డీజీ.. ప్రభుత్వానికి లేఖ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈరోజు తీర్పును వెలువరించనుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈరోజు తీర్పును వెలువరించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాదులు కోరుతున్నారు. అయితే చంద్రబాబుకు హౌస్ రిమాండ్‌ను సీఐడీ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరుపక్షాలు సోమవారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. న్యాయమూర్తి మంగళవారం మధ్యాహ్నం తీర్పు వెల్లడించనున్నట్టుగా తెలిపారు.
అయితే ఈ పరిస్థితుల వేళ జైళ్ల శాఖ డీజీ హరీష్ కుమార్ గుప్తా అడ్వొకేట్ జనరల్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. సోమవారం(సెప్టెంబర్ 11)న ఆయన ఈ లేఖ రాశారు. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని జైళ్ల శాఖ డీజీ అందులో పేర్కొన్నారు. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో అన్ని రకాల వసతులతో కూడిన స్పెషల్ వార్డు కేటాయించామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బ్లాక్ శానిటైజ్ చేశామని తెలిపారు. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్‌కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించామని చెప్పారు.
చంద్రబాబు ఉన్న బ్లాక్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. స్పెషల్ వార్డు ముందు ప్రత్యేక వైద్య బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించినట్టే అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. కేవలం చంద్రబాబు అనుమతిస్తేనే ఎవరికైనా ఎంట్రీక కల్పిస్తున్నామని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అక్కడి భద్రతను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఇక, జైళ్ల శాఖ డీజీ నుంచి వచ్చిన ఈ లేఖను.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమర్పించినట్టుగా సమాచారం.