చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండురోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకున్నారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతుల వెంట తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. 

ఇకపోతే పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాత్రికి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నాం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు వెళ్తారు. చంద్రయాన్ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించనున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు. 

రాష్ట్రపతి  పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఏపీ పోలీస్ శాఖ. నలుగురు ఎస్పీ స్థాయి అధికారులు, ఆరుగురు ఏఎస్పీలు, 22 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు, 300 మంది ఏఎస్‌ఐ, హెచ్‌సీలు, 400 మంది పీసీలు, స్పెషల్‌ పోలీసులు 200 మంది, మూడు కంపెనీల ఏపీఎస్పీ సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి 470 మంది, మొత్తం 1,692 మందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.