మగపిల్లాడిని కనాలని అత్తింటివారి వేధింపులు : ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి గర్భిణి ఆత్మహత్య

First Published 14, Jun 2018, 11:58 AM IST
Pregnant Woman Commits Suicide With Two Children In Chittoor District
Highlights

చిత్తూరు జిల్లాలో దారుణం

మగ పిల్లాడిని కనాలంటూ అత్తింటివారి  వేధింపులను తట్టుకోలేక ఓ గర్భిణి తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చూసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లల్ని కన్నావు, ఈ సారి మగపిల్లాడిని కనాలంటూ భర్తతో పాటు అత్తా మామలు, ఆడపడుచులు వేధించడంతో భయపడిపోయిన ఈ గర్భిణి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  చిత్తూరు పట్టణం సమీపంలోని కండ్రిగ గ్రామానికి చెందిన గురునాథంతో సరళ కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే సరళ మూడోసారి గర్భం దాల్చింది. దీంతో ఈసారి మగ పిల్లాడినే కనాలంటూ భర్తతో పాటు అత్తింటివారు వేధింపులకు దిగారు. సూటిపోటి మాటలతో సరళ ని మానసిక క్షోభకు గురి చేశారు.

దీంతో ఈసారి కూడా మగపిల్లాడు పుడతాడో, లేడో అని సరళ భయపడిపోయింది. ఇలా జరిగితే భర్త, అత్తమామలు తనను ఇంకా వేధిస్తారని భయపడిపోయింది. దీంతో  కఠిన నిర్ణయం తీసుకుంది. తనతో పాటు తన ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని బావిలో దూకి ఆత్మహత్య కు పాల్పడింది. 

సరళ ఆత్మహత్య విషయం తెలియగానే అత్తింటి వారు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.  తమ కూతురితో పాటు మనవరాళ్ల ఆత్మహత్యలకు ఆమె భర్త, అత్తమామలే కారణమంటూ తల్లిదండ్రులు  ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

loader