Asianet News TeluguAsianet News Telugu

తెలుగుకు తెగులు

హర్యానా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో తెలుగు భాషను రెండో భాషగా ఎంపిక చేసుకుని చదువుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలిస్తున్నాయి

predicament of Telugu language

తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు తెగులు సోకింది. మాతృభాష పరిరక్షణ కోసం ఏకంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే విషయంపై ప్రభుత్వం యోచించే దుస్ధితికి చేరుకుంది. బహుశా ఇంతటి దుస్ధతి ఏ రాష్ట్రంలోనూ ఉండి వుండదు. మాతృభాషకు పెద్ద పీట వేయటంలో మిగిలిన రాష్రాలు పోటీ పడుతుంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే తెలుగు భాష పూర్తిగా నిర్లక్ష్యంలో కొట్టు మిట్టాడుతోంది.

 

రాష్ట్ర సమాచార, భాషా అభివృద్ధి శాఖల మంత్రి పల్లె రఘానాధరెడ్డి మాట్లాడుతూ, తెలుగు భాష పరిరక్షణకు, ప్రోత్సాహానికి ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించటం కన్నా మార్గం కనబడటం లేదని చెప్పటం నిజంగా ఎంతో సిగ్గు చేటు. ప్రతీ రాష్ట్రంలోనూ వారి మాతృభాషను ప్రోత్సహిచటంలో భాగంగా ఎన్నో చర్యలు తీసుకుంటూంటే తెలుగు రాష్ట్రాల్లోమాత్రం భాషా పరిరక్షణకు కమిటిలు వేసారంటేనే ఎంతటి దుస్ధితి వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.

 

ఎంతో ప్రాచీనమైన తెలుగు భాషకు ఇంతటి దుస్ధితి పట్టటానికి ప్రధాన కారణం పాలకులే. పాలకుల నిర్లక్ష్యం వల్లే మాతృభాష దయనీయస్ధితిలోకి జారిపోయింది. దగ్గరుండి స్వయంగా పాలకులే తెలుగును నిర్వీర్యం చేసారనటానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.

 

ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్ధులు ఎవరూ తెలుగు భాషను మాట్లాడేందుకు వీల్లేదనే ఆంక్షలున్నాయి. అదే పాఠశాలల్లో చదివే ఇతర భాషల విద్యార్ధులు మాత్రం వారి భాషల్లోనే మాట్లాడుకుంటున్నారు.

 

మరి తెలుగు విద్యార్ధులు మాత్రం కనీసం వారిలో వారు కూడా తెలుగులో మాట్లాడుకునేందుకు యాజమాన్యం అనుమతించటం లేదు. ఉపాధ్యాయులు కూడా తెలుగులో మాట్లాడేందుకుకు లేదు. విద్యార్ధలెవరైనా తెలుగులో మాట్లాడుకుంటే యాజమాన్యం నుండి హెచ్చరికలు వస్తాయి.

 

రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలోనూ ఇదే పరిస్ధితి. ఓ వైపు హర్యానా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో తెలుగు భాషను రెండో భాషగా ఎంపిక చేసుకుని చదువుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలిస్తుంటే స్వయంగా తెలుగు రాష్ట్రం అయ్యుండీ నిర్లక్ష్యం చేయటం మన ప్రభుత్వాలకే చెల్లింది.

 

పాలకులే దగ్గరుండి మరీ తెలుగు భాషకు సమాధి కడుతుంటే ఇక, భాష బ్రతికే అవకాశం ఎక్కడిది? ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అమరావతిలో ఏర్పాటు చేయిస్తున్న విద్యాసంస్ధల్లో తెలుగుకు పెద్ద పీఠ వేస్తారని అందరూ అనుకుంటున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున తెలుగుకు ప్రోత్సాహం ఇస్తారని భాషా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios