ప్రకాశం జిల్లా చీరాలలో సంచలనం సృష్టించిన ఓ యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ అధికారులు మీడియా సమావేశంలో వివరించారు.

చీరాల పట్టణంలోని హారిస్ పేటకు చెందిన నల్లగొండ్ల నయోమి, చిరంజీవి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి మొదటి కుమారుడు దినేశ్ (19) రైల్వేస్టేషన్ వద్ద వున్న పెట్రోల్ బంకులో  పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన కంపా సంధ్య అనే యువతి దినేశ్‌ ఇంటి సమీపంలోని ఓ చర్చికి ప్రతి ఆదివారం వచ్చేది. ఈ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం ప్రేమగా మారింది.

Also Read:గొర్రెకుంట హత్యల కేసులో మరో ట్విస్ట్: వెనక ఆ మహిళ...

అయితే వీరిద్దరి వ్యవహారం సంధ్య ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబసభ్యులు దినేశ్‌ను పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పెద్దలు సంధ్యను చీరాలలో కాలేజీ మాన్పించి బాపట్లలో చేర్పించారు.

అయినప్పటికీ వదలని దినేశ్ బాపట్లలోని సంధ్య చదివే కాలేజీకి వెళ్లి ఆమెతో మాట్లాడేవాడు. ఈ విషయం సంధ్య తల్లికి తెలియడంతో గురై రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

దినేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంధ్య అన్నయ్య వంశీ, ఆమె తండ్రి రాజేశ్‌లు అతనిపై కక్ష పెంచుకున్నారు. ఏ విధంగానైనా దినేశ్‌ను హతమార్చాలని పథకం వేశారు. దీనిలో భాగంగా పక్కా ప్రణాళికతో వంశీ ప్రియురాలు పావని అనే యువతి ద్వారా దినేశ్‌ను ట్రాప్ చేశారు.

వెదుళ్లపల్లికి వస్తే చంపేయాలనే నిర్ణయానికి వచ్చిన వారు అనేక సార్లు  పావని, సంధ్యతో దినేశ్‌కు ఫోన్లు చేయించారు. అయితే దినేశ్ లాక్‌డౌన్ కారణంగా వారి వద్దకు వెళ్లలేకపోయాడు.

పావని ఫోన్ చేసిన సమయంలో తన ఫోన్ పోయిందని దినేశ్ ఆమెకు చెప్పడంతో తన వద్ద కొత్త ఫోన్ ఉందని వెదుళ్లపల్లికి వస్తే ఫోన్ ఇస్తానని చెప్పింది. దీనిని నమ్మిన దినేశ్ తన స్నేహితునితో కలిసి బైక్‌పై వెదుళ్లపల్లి బయలుదేరాడు.

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సంధ్య తండ్రి రాజేశ్ తన కుమారుడైన వంశీకి కోడి పందేలకు ఉపయోగించే ఇచ్చి పంపించాడు. వంశీ తన స్నేహితుడైన వెదుళ్లపల్లికి చెందిన బొజ్జగాని దుర్గారావు, అదే ప్రాంతానికి చెందిన మరో మైనర్ బాలుడితో కలిసి దినేశ్‌ను హత్య చేసేందుకు మాటు వేశారు.

ఈ క్రమంలో దినేశ్ తన స్నేహితునితో కలిసి వెదుళ్లపల్లికి వెళుతుండగా తోటవారిపాలెం బైపాస్ రోడ్డుకు సమీపంలోని కృపానగర్ వద్ద వంశీ అతని స్నేహితులు దినేశ్ వాహనాన్ని అడ్డగించారు.

Also Read:బావిలో మృతదేహాల మిస్టరీ: సంజయ్ కుమార్ భార్య అదృశ్యం

ప్రమాదాన్ని పసిగట్టిన దినేశ్ వారి నుంచి తప్పించుకుని పరుగులు తీయగా.. వారు వెంబడించి  కత్తులతో గొంతు కింది భాగంలో బలంగా పొడిచారు. తీవ్రగాయాల పాలైన దినేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అయితే ఆటోనగర్ బైపాస్ రోడ్డు వద్ద కుందేరు బ్రిడ్డిపై ఉన్నారనే విషయం తెలుసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

వారితో పాటు హత్యకు ఉపయోగించిన రెండు  కోడి కత్తులు, రెండు  సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన సంధ్య, ఆమె తండ్రి రాజేశ్‌లు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరగా పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.