అమరావతి: ప్రజా వేదికను కూల్చివేయాలని ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి నివాసానికి కూడా అదే ముప్పు ఏర్పడవచ్చునని భావిస్తున్నారు. అందుకు తగినట్లుగానే మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు కూడా ఉన్నాయి. ప్రజా వేదికను కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన విమర్శలకు జవాబిస్తూ - చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని బొత్స సత్యనారాయణ చెప్పారు. 

ప్రజా వేదికను చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలతో సమావేశానికి, మీడియా సమావేశాలకు, ఇతర పనులకు వాడుకున్నారు. అది చంద్రబాబు నివాసం పక్కనే ఉంటుంది. చంద్రబాబు 2015లో హైదరాబాదు నుంచి అమరావతికి మారిన తర్వాత కృష్ణా నది ఒడ్డున నిర్మించిన ప్రైవేట్ భవనంలో నివాసం ఉంటున్నారు. 

చంద్రబాబు ఆ భవనంలో చేరడానికి ముందు అక్రమ కట్టడంగా పేర్కొంటూ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆ భవనం నుంచి చంద్రబాబును ఖాళీ చేయిస్తామని మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెసు శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. ఆ భవనం ఆయన నియోజకవర్గంలోనే ఉంది. కృష్ణా కరకట్టపై నిర్మించిన భవనాలపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. వాటిలో చంద్రబాబు నివాసం కూడా ఉంది. 

ప్రజా వేదిక నిర్మాణంలో ఉల్లంఘించిన నిబంధనలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. నదీ పరిరక్షణ చట్టాన్ని, సిఆర్డీఎ మాస్టర్ ప్లాన్ ను, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలను, బిల్డింగ్ బైలాస్ ను ఉల్లంఘిస్తూ ప్రజా వేదికను నిర్మించారని ఆయన చెప్పారు. లోకాయుక్త సిఫార్సులను లెక్క చేయకుండా ఆ భవనాన్ని నిర్మించారని ఆయన చెప్పారు. 

ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసానికి అప్పట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనుమతి ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ఆ భవన నిర్మాణం నదీ వరద స్థాయికి దిగువన జరుగుతోందని, భవనం 19.5 మీటర్ల స్థాయిలో ఉండగా, కృష్ణా నది వరద నీటి మట్టం 22.5 మీటర్లకు ఉంటుందని ఇంజనీరు చెబుతూ అనుమతి ఇవ్వడానికి ఇష్టపడలేదు. 

అయితే, వాటిని వేటినీ లెక్క చేయకుండా వారం రోజుల గడువు మాత్రమే ఇస్తూ అప్పటి మంత్రి షార్ట్ టెండర్లను ఆహ్వానించారు ఎన్ సీసి, అశోక బిల్డర్లు నిర్మాణానికి ముందుకు వచ్చాయి. ఆ ప్రాజెక్టును ఎన్ సిసి రూ. 5 కోట్లకు దక్కించుకుంది. అయితే, నిర్మాణం జరుగుతున్న క్రమంలో వ్యయాన్ని రూ. 8.5 కోట్లకు పెంచారు. 

ఆ ప్రజావేదిక పక్కనే ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం ఉంది. నిబంధనలను లెక్క చేయకుండా నిర్మాణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కుంటున్న క్రమంలో దాన్ని కూడా కూల్చివేయడానికే జగన్ ప్రభుత్వం సిద్ధపడుతుందని అంటున్నారు