ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో తమ పార్టీ గుర్తు హెలికాఫ్టర్‌పై వేసిన ఓట్లు వైసీపీ సింబల్ ఫ్యాన్‌కు పడ్డాయని అనుమానం వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.

ఢిల్లీలో ఉన్న ఆయన కార్యకర్తలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో సందేశాన్ని అందించారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీకి గాని, వైసీపీకి గానీ 100 సీట్లలోపే వస్తాయని అప్పుడు తమ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలే కీలకమవుతారని ఆయన జోస్యం చెప్పారు.

దేశంలో జరిగిన ఎన్నికలు.. ఆదివారం ఎగ్జిట్ పోల్స్ చూసి షాకయ్యానని...ఈవీఎంలను ట్యాంపరింగ్, మానిప్యులేట్ చేసి మేనేజ్ చేశారని పాల్ ఆరోపించారు. నరసాపురం ఈవీఎంలలో 12 బటన్(హెలికాఫ్టర్) నొక్కితే.. 2వ బటన్ (ఫ్యాన్ గుర్తుకు)కు ఓట్లు పడ్డాయని ఆరోపించారు.

ఈ విషయాన్ని కొంతమంది ఓటర్లు తన దృష్టికి తీసుకొచ్చారని దీంతో తాను వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశానని కేఏ పాల్ తెలిపారు.

ఈ ఎన్నికలు మొత్తం అక్రమమని తాను ముందు చెప్పానని.... కానీ, ఇప్పుడు అందరూ దీనిపైనే మాట్లాడుతున్నారని.. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, సీఐఐ కపిల్ సిబల్ లాంటి మేధావులు చెప్పిన దాని ప్రకారం అక్రమాల వెనుక యూఎస్, రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయని నిర్థారణైందని.. 23వ తేదీన పూర్తి స్థాయి సమాచారం బయటకు వస్తుందని కేఏ పాల్ తెలిపారు.