విశాఖపట్టణం సమీపంలోని ఎన్టీపీసీ సిహాంద్రి‌లో 4 యూనిట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో 2 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో.. ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లాయి.

విశాఖపట్టణం సమీపంలోని ఎన్టీపీసీ సిహాంద్రి‌లో 4 యూనిట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో 2 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో.. ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లాయి. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపోయింది. దీంతో అధికారులు.. విద్యుదుత్పత్తిని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఎన్టీపీసీ సింహాద్రిలో నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోవడం ఇదే ప్రథమం అని అధికారులు తెలిపారు. 

గ్రిడ్‌ నుంచి కూడా ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్ సరఫరా కాలేదు. దీనికి తోడు గత అర్ధరాత్రి నుంచి పరవాడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడం మరింత ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఉమ్మడి విశాఖ జిల్లాకు అవసరమైన విద్యుత్ సరఫరా చేస్తున్న కలపాల 400 కేవీ విద్యుత్ స్టేషన్‌కు గ్రిడ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. దాదాపు రెండున్నర గంటలు శ్రమించిన అధికారులు గ్రిడ్ నుంచి ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్‌ను పునరుద్ధరించి పాక్షికంగా సరఫరా చేస్తున్నారు. 

మరోవైపు పెడగంట్యాడ మండలం పాలవలస హిందూజా పవర్ ప్లాంట్‌లో కూడా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. 1,040 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో పునరుద్దరణ పనులు చేపట్టారు. దక్షిణాది గ్రిడ్‌లో లోపం వల్లే సింహాద్రి, హిందూజా ప్లాంట్లలో నిలిచిన విద్యుదుత్పత్తి నిలిచిపోయిందని చెప్పారు. అత్యవసరంగా ఇంజనీర్లంతా విధులకు హాజరుకావాలని ఎన్టీపీసీ ఆదేశించింది. మొత్తం అన్ని విభాగాలకు ఆదేశాలు జారీచేసింది. ఎన్టీపీసీ సింహాద్రిలో విద్యుదుత్పత్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉందిన సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. 

ఇక, ఓ వైపు ఎండలు, విద్యుత్ కోతలతో తల్లడిలుతున్న ప్రజలకు తాజా పరిమాణంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎన్టీపీసీ సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తి పునరుద్దరించే వరకు.. మరింతగా విద్యుత్ కోతలు సంభవించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.