చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి కుప్పం పర్యటనలో అనూహ్యమైన అనుభవం ఎదురైంది. ఆయన బస చేస్తున్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు కరెంట్ కట్ అయింది. దీనిపై మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావాలనే చంద్రబాబు బస చేస్తున్న అతిథి గృహానికి కరెంట్ కట్ చేశారని ఆయన ఆరోపించారు. జనరేటర్ లేదని, కనీసం బ్యాటరీ కూడా ఇవ్వలేదని ఆయన ్న్నారు. రాబోయే రోజుల్లో తాము కూడా ఇటువంటి షాకే ఇస్తామని అమర్నాథ్ రెడ్డి అన్నారు.

చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కుప్పం నియోజకవర్గంలో ఘోరమైన పరాజయానికి గురైంది. ఈ నేపథ్యంలో క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 

గురువారం తొలి రోజు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన వైసీపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు, పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చక్రవడ్డీ చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. భయపెట్టి ఓట్లు వేయించుకోవడం నీచమని ఆయన అన్నారు.