కడప జిల్లా ఎర్రగుంట్ల లో ఆధార్ కార్డులు కుప్పలు తెప్పలుగా రోడ్డు మీదే పడి ఉన్నాయి. అయితే.. పోస్ట్ మెన్ నిర్లక్ష్యంగా కారణంగా ప్రజల దగ్గర ఉండాల్సిన ఆధార్ కార్డులు ఇలా రోడ్డు మీద పడి ఉన్నాయని తెలిసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఎర్రగుంట్ల పోస్టాఫీసుకు చాలా రోజుల క్రితం  లబ్ధిదారులకు చెందిన ఆధార్ కార్డులు ఆధార్ కేంద్రం నుంచి వచ్చాయి. వాటిని పోస్ట్ మెన్ పంపిణీ చేయాల్సి ఉంది. అయితే.. వీటిని పంపిణీ చేయాల్సిన విషయాన్ని మర్చిపోయి.. వాటిని ఓ హోటల్ లో వదిలేశాడు.

ఆ హోటల్ వాళ్లు వాటిని కొన్నాళ్లుగా భద్రపరిచి ఇక చేసేదేమీ లేక రోడ్డుపై పడేశారు. వీటిని మంగళవారం గమనించిన కొందరు విలేకరుల దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై విచారించగా పోస్ట్‌మన్‌ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది. తాను రోజూ ఆ హోటల్‌లో భోంచేస్తున్నానని, వాటిని అక్కడే మరచిపోయినట్లు పోస్ట్‌మన్‌ హుస్సేన్‌ తెలిపారు. వాటి కోసం చాలా చోట్ల వెతికానని అయితే అవి కనిపించలేదని చెప్పాడు. కావాలని తప్పుచేయలేదని పొరపాటు జరిగిందని పేర్కొన్నాడు.