తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి కొరియన్ కంపనీ పోస్కో భారీ విరాళం ఇచ్చింది. ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.9కోట్ల విరాళం ఇచ్చింది ఈ సంస్థ. ఈమేరకు పోస్కో సంస్థ సీఈవో సంజయ్‌ పాసి విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

మొదట సీఈవో సంజయ్‌ పాసి భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం టిటిడి అధికారులను కలిసిన సంజయ్ విరాళాన్ని అందజేశారు. 

read more  వాళ్లు నన్ను కలిసిన మాట వాస్తవమే.. కానీ: పోస్కోపై జగన్ స్పష్టత

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చెందిన మిగులు భూముల్లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుకు సౌత్ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి చూపించినట్లు ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే. లోక్ సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ మేరకు పోస్కో ఆర్ఐఎస్ఎల్ మధ్య 2019 అక్టోబర్‌లో న్యాయపరంగా కట్టుబాట్లు లేని ఎంవోయూ కుదిరినట్లు చెప్పారు.

ఎంఓయూ ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్‌లో 50 శాతం వాటా తమకు ఉండాలని పోస్కో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. పోస్కో- హ్యుండయ్ సంయుక్త బృందం 2018 అక్టోబర్ 22న విశాఖలోని ఆర్ఐఎస్ఎల్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. 

పోస్కో ప్లాంట్‌ ఏర్పాటుకు ఇప్పటికే జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైందని ఆయన వెల్లడించారు. కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా 50 శాతం వుందని ధర్మేంద్ర చెప్పారు. ఇప్పటి దాకా ఒప్పందం వివరాలు రహస్యమని.. 2019 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు పోస్కో బృందం స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2019 జూలై, సెప్టెంబర్‌, 2020లోనూ ఆర్ఐఎస్ఎల్‌ను పరిశీలించిందని ప్రధాన్ వెల్లడించారు.