రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర అంటే ఒక్క విశాఖపట్నం మాత్రమే కాదని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా ఉన్నాయన్న విషయం ఉన్నతాధికారులకు అర్ధమవ్వటమే పెద్ద అభివృద్ధిగా ఇపుడు ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పుకుంటున్నారు.
రాజకీయాలే ఉత్తరాంధ్రకు పెద్ద శాపంగా తయారైంది. దశాబ్దాల తరబడి ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగకపోవటానికి, సమస్యలు పరిష్కారం కాకపోవటానికి కేవలం రాజకీయాలే కారణం. అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం సామాన్య ప్రజలు, స్వచ్చంధ సంస్ధలు దశాబ్దాల తరబడి చేస్తున్న పోరాటాలు నిష్ప్రయోజనం అవుతున్నాయి. ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్న వారిపై పోలీసు కేసులు బోనస్.
ఉత్తరాంధ్రలో విశాఖపట్నం నగరం చాలా కీలకం. అదే నగరం ఉత్తరాంధ్రకు పెద్ద అడ్డంకిగా కూడా తయారైంది. ఎందుకంటే, మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క విశాఖపట్నంలోనే జరుగుతోంది. విశాఖపట్నంలో జరుగుతున్నఅభివృద్ధిని మొత్తం ఉత్తరాంధ్రకు ఆపాదిస్తుండటంతో ఉత్తరాంధ్రలోని మిగిలిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు దారుణంగా దెబ్బతింటున్నాయి.
ఇటు రాష్ట్ర రాజధానిలో గానీ అటు ఢిల్లీలో గాని మొన్నటి వరకూ ఉత్తరాంధ్రకు సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడితే విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తున్నాం కదా, లేక విశాఖకు మంజూరు చేస్తున్నాం కదా అని ప్రశ్నించేవారు ఉన్నతాధికారులు.
అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర అంటే ఒక్క విశాఖపట్నం మాత్రమే కాదని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా ఉన్నాయన్న విషయం ఉన్నతాధికారులకు అర్ధమవ్వటమే పెద్ద అభివృద్ధిగా ఇపుడు ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పుకుంటున్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాజకీయాలే శాపంగా ఎలా మారిందంటే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ రాకపోవటానికి ప్రధాన కారణం కేవలం రాజకీయాలే. రాజకీయ నేతల్లో లోపించిన చిత్తశుద్ది, అనైక్యత, ఆధిపత్య పోరే పెద్ద శాపం. భువనేశ్వర్ జోన్ నుండి కొంత ప్రాంతాన్ని విడదీసి విశాఖ రైల్వేజోన్ గా మార్చటానికి ఒడిస్సాలోని రాజకీయ పార్టీలు మొత్తం ఐకమత్యంగా పోరాటం చేయటం గమనార్హం.
ఇక, ప్రపంచం మొత్తం వద్దన్న అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మన ప్రభుత్వం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు తీసుకువస్తున్నది. ఈ కేంద్రాలు వద్దని స్ధానిక ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా ఉపయోగం కనబడటం లేదు. అంటే, ఇక్కడి ప్రజలు కావాలన్న వాటిని ప్రభుత్వాలు ఖాతరు చేయకపోగా వద్దన్న వాటిని మాత్రం బలవంతంగా రుద్దుతున్నారు.
నానాటికి దిగజారిపోతున్న నిరక్షరాస్యత, ప్రజారోగ్యం, పెరుగుతున్న వలసలు, దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఉథ్థానం కిడ్నీ సమస్యలు, బాల్య వివాహాలు, భ్రూణహత్యలు తదితర సమస్యలేవి ఘనత వహించిన ప్రజాప్రతినిధులెవరికీ పట్టటం లేదు. అధికార, ప్రతిపక్షమన్నది కేవలం సాంకేతిక సమస్యే. రాజకీయ నేతలందరూ ఒకటేనన్నది కాలం నిరూపించిన సత్యం.
