ఆంధ్ర ప్రదేశ్ లోో మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డారు. అయితే ఎప్పటిలా కాకుండా కొందరు నాయకులు సరికొత్తగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు..
ఒంగోలు : కేవలం పది రూపాయలకే మందు బాటిలా... 50 రూపాయలకే బియ్యం బస్తానా..! అవును... మీరు విన్నది నిజమే. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల లీలలు మామూలుగా లేవు... వాటి ఫలితమే పది రూపాయల మందు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓ పొలిటికల్ పార్టీ ఇలా పోల్ మేనేజ్ మెంట్ చేస్తోంది.
అసలు విషయం ఏమిటంటే... ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటినుండి సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం... ఇలా వివిధ మార్గాల్లో ప్రజలవద్దకు వెళుతూ ప్రచారం నిర్వహించాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు పోలింగ్ కు కేవలం కొన్నిగంటల సమయం మాత్రమే మిగిలివుంది. ఏం చిసినా మే 13న పోలింగ్ ముగిసేవరకే... అందువల్లే రాజకీయ పార్టీలు మరింత దూకుడుగా ప్రజలవద్దకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల అధికారులను బురిడీ కొట్టించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓ పొలిటికల్ పార్టీ సరికొత్త ఎత్తుగడ వేసింది.
ఎన్నికల వేళ మద్యం ఏరులై పారుతుందన్నది అందరికి తెలిసిందే. ముందుగానే అభ్యర్థులు భారీగా మద్యం కొనుగోలు చేసి నాయకులు, కార్యకర్తల ద్వారా ఓటర్లకు పంచుతుంటారు. అయితే ఇలా మద్యం పంచుతూ ఎన్నికల అధికారులకు దొరికితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మట్టి చేతికి అంటకుండానే మద్యం బాటిల్ ఓటర్ చేతికి చేరే సరికొత్త ఆలోచన చేసిందో రాజకీయ పార్టీ.
ప్రకాశం జిల్లా ఒంగోలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ మద్యం పంపిణీ జరుగుతోంది. నేరుగా ఓటర్ చేతిలో మందుబాటిల్ పెట్టకుండా ఓ పది రూపాయల నోటును పెడుతున్నారట కొందరు నాయకులు. ఆ నోటు తీసుకెళ్లి వైన్ షాప్ లో ఇస్తే సీరిస్ నెంబర్ సరిచూసుకుని క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారట. అంటే పదిరూపాయలకు వంద రెండువందల విలువగల మందు బాటిల్ వస్తోందన్నమాట.
ఇదే పద్దతిలో మహిళలకు బియ్యం బస్తాలను కూడా పంపిణీ చేస్తోందట సదరు రాజకీయ పార్టీ. మహిళా ఓటర్లకు 50 రూపాయల కరెన్సీ నోటు ఇస్తున్నారు... దీన్ని వారు సూచించిన షాప్ లో ఇస్తే బియ్యం బస్తా ఇస్తున్నారట. ఇలా చాలా పద్దతిగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారట. అయితే మహిళలకు పంచేందుకు దాచిన భారీ బియ్యం బస్తాలు పట్టుబడటంతో ఈ నోట్ల బాగోతం బయటపడింది.
