విశాఖలో గీతం యూనివర్సిటీ గోడల కూల్చివేతలపై రాజకీయ రగడ మొదలైంది. ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ మండిపడింది. విశాఖలో విధ్వంసం సృష్టించి, ప్రజలను భయపెట్టడమే జగన్ లక్ష్యమంటూ విమర్శించింది.

విపక్ష నేతల సంస్థల టార్గెట్ చేస్తున్నారని ఆరోపించింది టీడీపీ. మొన్న సబ్బం హరి ఇవాళ గీతం యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు తెలుగు తమ్ముళ్లు. పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి సీఎం జగన్ అన్నారు నారా లోకేశ్.

విశాఖలో విధ్వంసం సృష్టించి ప్రజలను భయపెట్టడమే జగన్ లక్ష్యమని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌కు విధ్వంసం చేస్తేనే కిక్ వస్తుందని విమర్శించారు. గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్షసాధింపేనన్నారు లోకేశ్.

Also Read:కట్టలేరు.. కూల్చే హక్కు మీకెక్కడిది: గీతం కూల్చివేతలపై బాబు స్పందన

మొన్న సబ్బంహరి ఇల్లు, ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఇలా వరుస పెట్టి కూల్చివేస్తున్నారని మండిపడ్డారు నారా లోకేశ్. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షానికి సంస్థలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

అర్థరాత్రి వందల మందితో గీతం వర్సిటీలో కూల్చివేతలు చేయడం దారుణమన్నారు అచ్చెన్న. గీతం యూనివర్సిటీ లాభాపేక్ష కోసం పెట్టి అక్రమం లాభం పొందిన సంస్థ కాదని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

నారా లోకేశ్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడి దగ్గర భూమి స్వాధీనం చేసుకున్నందుకే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని అన్నారు అమరనాథ్. గీతం యూనివర్సిటీ రూ.800 కోట్ల విలువ చేసే 40 ఎకరాల భూమిని అక్రమించిందని ఆరోపించారు.

ఓ ప్రైవేట్ సంస్థ భూమిని అక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు. అవినీతిపరులకు టీడీపీ పొలిట్ బ్యూరోలో అవకాశం , పదవులు కట్టబెట్టారని గుడివాడ మండిపడ్డారు.

గీతం యూనివర్సిటీ ఆధీనంలో వున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్డీవో తెలిపారు. దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం యూనివర్సిటీ పరిధిలో ఉన్నట్లు గుర్తించామన్నారు.

ప్రభుత్వ భూమిని మార్చేసినట్లు గీతం యూనివర్సిటీ నిర్వాహకులకు తెలుసునని ఆయన చెప్పారు. ఇదిలావుండగా గీతం యూనివర్సిటీలో కూల్చివేతల ప్రాంతాన్ని టీడీపీ బృందం సందర్శించింది.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ సహా పలువురు నేతలు కూల్చివేతలను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగానే ఈ చర్యకు దిగందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.