విజయవాడ: ముదినేపల్లిలో దళితులపై దాడి చేసిన వారిని తప్పించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ సోమవారం టిడిపి చలో ఐనంపూడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐనంపూడికి బయలుదేరిన నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. మార్గమధ్యలో గొల్లపూడి వద్ద ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులు అడ్డుకున్నారు. 

వీడియో

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారు ఐనంపూడికి చెందిన దళిత యువతిని  ప్రేమ పేరుతో సాయిరెడ్డి అనే యువకుడు వేధించాడు. చివరకు పెళ్లి చేసుకోమని అన్నందుకు కక్ష కట్టి అర్ధరాత్రి యువతి ఇంటిపై నిప్పంటించాడు. అయితే ఇలా దారుణానికి పాల్పడ్డ నిందితుడు సాయిరెడ్డి తరపున వైసీపీ నాయకులు బాధిత కుటుంబంతో రాజీకి ప్రయత్నిస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. నిందితున్ని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి ఇలా రాజీ ప్రయత్నాలు చేయడంపై టిడిపి నాయకులు మండిపడుతున్నారు.  

ఈ ఘటనపై కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ, జిల్లా సమన్వయ సమావేశాన్ని నిర్వహించి దళిత వర్గానికి చెందిన కుటుంబంపై దాడి చేసి ఇంటిని తగలబెట్టి, కుటుంబ సభ్యుల సజీవ దహనానికి కుట్ర చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత శనివారం సాయంత్రం లోపు నిందితులను అరెస్ట్ చేయాలని డెడ్ లైన్ విధించారు. అయితే ఇప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో టిడిపి చలో ఐనంపూడి చేపడుతోంది.