శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ట్రాక్ పై శవమై కనిపించిన పదహారేళ్ల అమ్మాయి సింధు మృతి కేసును పోలీసులు ఛేదించారు. రాత్రి కుటుంబ సభ్యులతో నిద్రించి తెల్లారేసరికి రైల్వే ట్రాక్ పై ఆమె శవమై కనిపించింది. అయితే, ఆమెను మణికంఠ అనే సహ విద్యార్థి చంపేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

ఆ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం ధర్మవరంలో జరిగింది. మణికంఠను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సింధు మృతితో మణికంఠకు ఏ విధమైన సంబంధం లేదని పోలీసులు తేల్చారు.

Also Read: పదహారేళ్ల అమ్మాయి మృతి: రేప్, హత్య అనుమానం, సహ విద్యార్థి పనే

మణికంఠను సింధు ప్రేమించిందని, ఆ ప్రేమకు మణికంఠ అంగీకరించలేదని, దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు. ఇటీవల సింధు తల్లిదండ్రులతో, తమ్ముడితో ముచ్చట పెట్టి నిద్రపోయింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి పక్కన ఉన్న బాత్రూంకు వెళ్లింది. తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. 

చివరకు ఆమె శవం రైల్వే ట్రాక్ పై కనిపించింది. ఆమె సెల్ ఫోన్ ను పరిశీలించగా మణికంఠ పంపిన మెసేజ్ ఉంది. దాంతో మణికంఠనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెపై అత్యాచారం చేసి తర్వాత ఆమెను చంపేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.