కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ‘ఛలో అమరావతి’ పాదయాత్రను ప్రారంభించేసారు. ఇంతకాలం తన ఇంటినుండి ముద్రగడ బయటకు వచ్చినపుడల్లా పోలీసులు అడ్డుకుంటున్న సంగతి అందరూ చూస్తున్నదే. అందుకే ముద్రగడ ఆదివారం మెరుపు పాదయాత్రను చేపట్టారు.  పెద్ద ఎత్తుర కాపు నేతలు, మద్దతుదారులు వెంటరాగా కిర్లంపూడిలోని తన ఇంటి నుండి రాజుపాలెం దిశగా పాదయాత్ర మొదలుపెట్టేసారు. ఇంటి వద్ద పోలీసులున్నప్పటికీ వారెవరూ ముద్రగడను ఈసారి అడ్డుకోలేకపోయారు.

ముద్రగడ చుట్టూ మద్దతుదారులు రక్షణవలయంగా ఏర్పడి ఉద్యమనేతను రోడ్లపైకి తెచ్చేసారు. దాంతో ముద్రగడ చాలా వేగంగా రాజుపాలెం వైపు బయలుదేరారు. సుమారు 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత పోలీసులు ముద్రగడను మళ్ళీ అడ్డుకున్నారు. దాంతో రాజుపాలెం రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల్లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుండగా ముద్రగడ హటాత్తుగా పాదయాత్ర మొదలుపెట్టేయటం, పోలీసులు మళ్ళీ అడ్డుకోవటం గమనార్హం.