టీడీపీ సీనియర్ నేత, దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు తొలి వర్ధంతి బుధవారం జరగనుంది. దీంతో గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలకు కోడెల అనుచరులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘస్తున్నారంటూ పోలీసులు పలువురికి నోటీసులిచ్చారు. ఇందులో భాగంగా కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాంకు సైతం నోటీసులు ఇవ్వడం దుమారం రేపుతోంది.

కరోనా తీవ్రత నేపథ్యంలో బహిరంగంగా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అటు పోలీసుల వైఖరిపై కోడెల శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం ఎట్టి పరిస్థితుల్లోనూ యథావిధిగా అన్ని కార్యక్రమాలు చేపడతామని కోడెల శివరాం ప్రకటించారు. వైసీపీ నేతల సభలకు లేని అడ్డంకులు తమకు ఎందుకు ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే.. కార్యక్రమాలు ఆపబోమని శివరాం స్పష్టం చేస్తున్నారు.