విశాఖపట్నంలో భర్తను బురిడి కొట్టించి.. ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కోర్టు అనుమతితో సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖపట్నంలో భర్తను బురిడి కొట్టించి.. ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసులను, ఇతర ప్రభుత్వ శాఖలను తప్పుదోవ పట్టించినందుకు సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు అనుమతితో పోలీసులు సాయిప్రియ, రవితేజలపై ఐపీసీ సెక్షన్ 417, 494, 202 ఆర్/డబ్ల్యూ 34 కింద ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు వివరాలను వెల్లడించారు. ఇక, ఎన్‌ఏడీ జంక్షన్‌కు చెందిన శ్రీనివాసరావు, సాయిప్రియ దంపతులు జూలై 25న ఆర్‌కే బీచ్‌కు వచ్చారు. బీచ్‌లో కాసేపు గడిపిన తర్వాత.. ఆ దంపతులు నీటిలో ఆడుకోవడం ప్రారంభించారు. 

అయితే భర్త తన మొబైల్ ఫోన్‌లో ఏదో చూస్తూ బిజీగా ఉన్న సమయంలో సాయిప్రియ కనిపించకుండా పోయింది. అయితే సాయిప్రియ అలల తాకిడికి కొట్టుకుపోయి ఉండవచ్చనే అనుమానంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమె ఆచూకీ కోసం సముద్రంలో పోలీసులు, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని వనరులను వినియోగించారు. అయితే ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. ఇక, కొన్నాళ్లుగా రవితేజ‌తో ప్రేమలో ఉన్న సాయిప్రియ.. అతనితో కలిసి బెంగళూరుకు పారిపోయిందని పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణలో సదరు సాయిప్రియ ముందుస్తు ప్రణాళిక ప్రకారం రవితేజ‌తో వెళ్లిపోయిందని తేల్చారు. 

అయితే తన గురించి పెద్ద ఎత్తున గాలింపు కొనసాగుతున్నప్పటికీ.. సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను సాయిప్రియ విస్మరించిందని పోలీసులు చెప్పారు. సుమారు 48 గంటల పాటు సెర్చ్ చేపట్టిన పోలీసులు, ఇండియన్ కోస్ట్ గార్డ్‌ల వనరులు, విలువైన సమయాన్ని వృధా చేసినందుకు సాయిప్రియ, రవితేజలపై కోర్టు అనుమతి మేరకు కేసు బుక్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఆమె ఆచూకీ చెప్పకుండా తన భర్తకు మానసిక వేదన కలిగించారని కూడా పోలీసులు పేర్కొన్నారు.