విజయవాడ: విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వినిది ఖచ్చితంగా హత్యేనని పోలీసులు తేల్చారు. తామిద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామంటూ నిందితుడు నాగేంద్ర ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తమకు వివాహమైనట్లు కూడా ఓ ఫొటోను బయటపెట్టాడు. పోలీసులకు కూడా అతడు ఇదే వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో దివ్యది హత్యా, ఆత్మహత్యా అన్న అనుమానం అందరిలో మొదలయ్యింది. 

దీంతో మరింత పకడ్బందీగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ నివేదికల ఆధారంగా దివ్యది ముమ్మాటికీ హత్యేనని తేల్చారు. దివ్య శరీరంపై వున్న కత్తిపోట్లు తనకు తానుగా చేసుకున్నవి కాదని... నిందితుడు నాగేంద్రే ఈ పని చేశాడని నిర్దారించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. 

read more  దివ్యతేజ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం: నిందితుడిని శిక్షిస్తామని సీఎం జగన్ హామీ

విజయవాడలోని క్రీస్తురాజపురంలోని తన ఇంట్లో దివ్య తేజస్విని అనే విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో గదిలో బుడిగ నాగేంద్ర అలియాస్ చిన్నస్వామి రక్తం మడుగులో పడి ఉన్నాడు. 

ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో దివ్యను ఆమె తల్లి కుసుమ టిఫిన్ చేయడం కోసం లేపింది. అయితే కాసేపటి తర్వాత చేస్తానని చెప్పి దివ్య నిద్రలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వలంటీర్ రావడంతో కుసుమ కిందికి వెళ్లింది. అప్పటికే నాగేంద్ర వెనుక వైపు నుంచి దివ్య గదిలోకి ప్రవేశించి లోపలి నుంచి గడియ పెట్టాడు. పక్క గదికి కూడా గడియ వేశాడు. 

కుసుమ తిరిగి మేడకు వెళ్లి చూడగా బయట అబ్బాయి చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి తలుపు కొట్టింది. కానీ తలుపు ఎంతకీ తెరుచుకోలేదు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. తలుపు పగులగొట్టి చూడగా దివ్య రక్తం మడుగులో కనిపించింది. నాగేంద్ర చిన్నచిన్న గాయాలతో ఓ మూలన పడి ఉన్నాడు.