స్వయంగా కమీషనరే జోక్యం చేసుకోవటంతో సదరు పుత్రరత్నాన్ని అరెస్టు చేయక తప్పలేదు పోలీసులకు.
అధికారం చేతిలో ఉండటంతో టిడిపి నేతల్లో కొందరు ఎవరినీ వదలటంలేదు. ముఖ్యంగా కొందరు నేతలు లేదా వారి వారసులు మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. దాడులు చేయటం, అత్యాచార యత్నాలు, వేధింపులు తదితరాలకు తెగబడుతున్నారు. అడిగేవారు లేకపోవటంతో రెచ్చిపోతున్న వారిలో సాధారణ కార్యకర్తల నుండి ఎంఎల్ఏల వరకూ క్యూ కడుతున్నారు. ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, చిత్తూరు తదిగర జిల్లాల నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. పోలీసులు చోద్యం చూస్తూ కూర్చోవటంతో నేతలు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఎన్ఆర్ఐ మహిళను వేధిస్తున్నారనే ఆరోపణలపై ఓ యువనేతను పెనమలూరు పోలీసులు అరెస్టు చేసారు. జగ్గయ్యపేటకు చెందిన మాజీ శాసనసభ్యుడు అక్కినేని లోకేశ్వర్ రావు పుత్రరత్నం విజయకృష్ణ కొద్ది రోజులుగా ఓ ఎన్ఆర్ఐ మహిళను వేధిస్తున్నారు. ఈయనగారి వేధింపులు తట్టుకోలేక సదరు మహిళ విజయవాడ పోలీసు కమీషనర్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు రాగానే రంగంలోకి దిగిన పోలీసులు పుత్రరత్నాన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. నేతలపై చర్యలకు పోలీసులు ఎక్కడో గానీ దిగటం లేదు. చాలా కేసులు ఫిర్యాదు తీసుకోవటంతోనే సరిపుచ్చుతున్నారు పోలీసులు. ఈ ఘటనలో స్వయంగా కమీషనరే జోక్యం చేసుకోవటంతో సదరు పుత్రరత్నాన్ని అరెస్టు చేయక తప్పలేదు పోలీసులకు.
