వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఆ ఇష్టం ప్రేమగా మారడంతో పెళ్లి బంధం వైపు అడుగులు వేశారు.  కొంతకాలం పాటు వారి బంధం సజావుగానే సాగింది. అయితే.. అనుకోకుండా భర్త  మొదడులోకి అనుమానం అనే పురుగు దూరింది. అంతే... భార్య ను అనుమానించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే భార్య గర్భిణీ అనే కనికరం కూడా లేకుండా కాళ్లతో తొక్కి మరీ చంపేశాడు. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  పెదఉల్లగల్లు గ్రామానికి చెందిన గురులింగం కుమారుడు శ్రీనివాసులు, గుంటూరు జిల్లా చిలకలూరి పేట వాసి శైలజ నాలుగేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ప్రస్తుతం శైలజ మూడు నెలల గర్భిణి. ఇటీవల శ్రీనివాసులు భార్య శైలజ పై అనుమానం పెంచుకున్నాడు. నానా రకాలుగా ఆమెను హింసించేవాడు.

ఈ క్రమంలో ఆదివారం శైలజ ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె బంధువులకు సమాచారం అందించాడు. వాళ్లు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అయితే.. ఆమె ఆత్మహత్యపై అనుమానాలు తలెత్తడంతో పోలీసులు ఆమె భర్త శ్రీనివాసులు ను విచారించారు. దీంతో.. అతను తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. తానే నిద్రపోతున్న భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు.

తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తనకు అనుమానమని.. అందుకే.. మెడపై కాలి తో తొక్కి చంపేశానని చెప్పాడు. అనంతరం మెడకు చీర కట్టి.. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించానని చెప్పాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.