కడప జిల్లా పోరుమామిళ్లలో సంచలనం రేపిన మున్నీ హత్య కేసులో పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు కానిస్టేబుల్, ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.

కడప జిల్లా పోరుమామిళ్లలో సంచలనం రేపిన మున్నీ హత్య కేసులో పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు కానిస్టేబుల్, ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మున్నీని కిడ్నాప్‌ చేసిన కొందరు.. ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మున్నీ మృతిచెందింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై మహిళ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించింది. 

మరోవైపు ఈ కేసును జిల్లా ఎస్పీ సీరియస్‌గా తీసుకన్నారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే... ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్‌ షకీల కుమార్తె షేక్‌ మున్నీ (30)ని పదేళ్ల క్రితం కడప జిల్లా పోరుమామిళ్ల మండలం ఎగువ రామాపురం గ్రామానికి చెందిన మస్తాన్‌ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లిచేశారు. కొంతకాలానికి భార్యభర్తలు విడిపోయారు. భర్త నుంచి విడిపోయిన మున్నీ ఏడాదిగా కడప జిల్లా పోరుమామిళ్లలోని సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నారు. అక్కడే గది అద్దెకు తీసుకుని తల్లితో కలిసి అద్దెకు ఉంటుంది. అయితే సూపర్‌మార్కెట్‌ యజమాని మాబు హుస్సేన్‌తో మున్నీ సన్నిహితంగా మెలిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. 

ఈ క్రమంలోనే మున్నీ ఐదు నెలల క్రితం సూపర్‌మార్కెట్‌లో పనిమానేసి.. గిద్దలూరులోని శ్రీరామ్‌నగర్‌ కాలనీకి నివాసం మార్చింది. అయినప్పటికీ మాబు హుస్సేన్‌ కుటుంబంలో గొడవలు ఎక్కువయ్యాయి. ఈ గొడవలు మొత్తానికి మున్నీనే కారణమని భావించిన మాబు హుస్సేన్‌ కుటుంబసభ్యులు.. వారికి తెలిసిన కానిస్టేబుళ్లు సయ్యద్‌, జిలానీలను వెంటబెట్టుకుని సోమవారం సాయంత్రం గిద్దలూరు వెళ్లారు. మున్నీని పోరుమామిళ్లకు తీసుకొచ్చారు. మున్నీపై వారు దాడి చేయడంతో ఆమె తలకు బలమైన గాయమై అప స్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భయపడిన కాని స్టేబుళ్లు, మిగిలిన వాళ్లు అక్కడి నుంచి పారి పోయారు. అపస్మారక స్థితిలో ఉన్న మున్నీని మాబు హస్సేన్‌ కడపలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. 

కూతురు చనిపోయిన వార్త తెలుసుకన్న మున్నీ తల్లి షకీల.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మున్నీ మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు కానిస్టేబుళ్లు ఓ మహిళ కిడ్నాప్‌, హత్య కేసులో పాల్గొనడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.