విశాఖపట్నంలో మరోసారి కలకలం రేగింది. నగర శివారులోని  కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ నుండి విషవాయువులు లీకయ్యాయి. దీంతో కంపెనీ అనుకుని ఉన్న పిలకవాని పాలెం, కంచుమాంబ కాలనీల్లో నలుగురికి అస్వస్థతకు గురయినట్లు సమాచారం. విషవాయువుల నుండి కాపాడుకునేందుకు ఆయా కాలనీల ప్రజలు ఇళ్లను వదిలి రోడ్లపై పరుగులు తీశారు. అయితే ఈ విషవాయువు ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఎల్జీ పాలిమర్స్ ఘటనను మరువక ముందే విశాఖలో ఇలాంటి ఘటనను చోటుచేసుకోవడం అక్కడి ప్రజలను కలవరపెడుతోంది. ప్రభుత్వం వెంటనే ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుని తమ ప్రాణాలను కాపాడాలని విశాఖవాసులు కోరుతున్నారు.  

ఎరువుల కర్మాగారం 'కోరమాండల్' నుండి విష వాయువులు వెలువడటంపై సమాచారం అందుకున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. కర్మాగారం పరిసర గ్రామాల్లో స్థానికుల ఆరోగ్య పరిస్థితిపై గాజువాక పరిసర ప్రాంత అధికార యంత్రాంగంతో, ప్రస్తుతం కంపనీవద్ద పరిస్థితి గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి గౌతమ్ రెడ్డి

. ప్రస్తుతం ఎవరికీ ప్రమాదం లేదని తెలిసినా స్థానిక ప్రజలకు భరోసా కలిగే విధంగా అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వాయువు వెలువడిన కర్మాగారం ఏదనే దానిపై స్పష్టత లేకపోవడంతో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. వాయువు వెలువడిన కర్మాగారం, దాని ప్రభావం,  కారణాలపై నివేదిక  అందించాలని మంత్రి మేకపాటి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.