ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి, ఆ త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వం స్పందించిన తీరు. అనంత‌రం పాకిస్థాన్ చేసిన దాడులు ఇవ‌న్నీ భార‌త సైనికులపై ఉన్న గౌర‌వాన్ని రెట్టింపు చేశాయి. దేశం కోసం స‌రిహ‌ద్దుల్లో ప్రాణాల‌కు సైతం తెగించి పోరాడుతున్న సైనికుల‌కు దేశ‌మంతా సెల్యూట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా సైనికుల సేవ‌ల‌కు గుర్తుగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. భారత రక్షణ దళాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గ్రామ పంచాయతీ హద్దుల్లో ఉన్న వాళ్ల ఇళ్లపై ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వనున్నారు. దేశానికి సేవ చేస్తున్న వారికి కృతజ్ఞతగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఇంతకుముందు ఈ సౌకర్యం రిటైర్డ్ సైనికులకు లేదా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నవారికి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు, దేశంలో ఎక్కడ విధులు నిర్వహిస్తున్నా సర్వీసులో ఉన్న ప్రతి రక్షణ సిబ్బందికి ఇది వర్తిస్తుందని పవన్ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. 

ఈ నిర్ణయం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, పారామిలిటరీ దళాల ధైర్యానికి గౌరవంగా తీసుకున్నదని పవన్ చెప్పారు. "వాళ్ల దేశ సేవ అమూల్యం," అని ఆయన అన్నారు. రక్షణ సిబ్బంది లేదా వారి భార్యాభర్తలు నివసించే లేదా సంయుక్తంగా కలిగి ఉన్న ఇంటికి ఈ మినహాయింపు వర్తిస్తుంది.

పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్..

Scroll to load tweet…

ఈ నిర్ణయం సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సిఫారసు మేరకు తీసుకున్నట్టు పవన్ తెలిపారు. రాష్ట్రం తరఫున సైనికుల పట్ల గౌరవం, కృతజ్ఞతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని ప‌వ‌న్ అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.