అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభకు ఎన్నికైన వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఆయన బుధవారంనాడు ఎమ్మెల్సీ పదవికి, డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఏపీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పోరాటం చేశారని ఆయన అన్నారు. 

Also Read: ఎమ్మెల్సీ పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా

సీఎం జగన్ ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని ఆయన చెప్పారు. ఎంపీలు ఎవరైనా పార్టీ నిర్ణయాల మేరకు నడుచుకోవాల్సిందేనని ఆయన అన్నారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం సరి కాదని ఆయన అన్నారు. రఘురామ కృష్ణమ రాజును ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నట్లు అర్థమవుతోంది. పార్లమెంటుకు వెళ్లాలనేది తన చిరకాల వాంఛ అని ఆయన చెప్పారు.

మంత్రి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దాంతో వారిద్దరు ఎమ్మెల్సీ పదవులకు, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. శాసన మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్న జగన్ ఎమ్మెల్సీలుగా వారిద్దరిని రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.