అమరావతి:  డిప్యూటీ సీఎం పదవికి, ఎమ్మెల్సీ పదవులకు పిల్లి సుభాష్ చంద్రబోస్ బుధవారం నాడు  రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందున ఎమ్మెల్సీ పదవికి రాజీనామా  చేశారు. డిప్యూటీ సీఎం పదవికి కూడ ఆయన రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని సీఎం జగన్ కు అందించారు. 

ఎంపీగా ఎన్నికైన 14 రోజుల లోపుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. దీంతో ఎమ్మెల్సీ పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ సీఎం జగన్ గతంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలోనే తన మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు ఎమ్మెల్సీలకు రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు గత నెల 19వ తేదీన జరిగిన ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు విజయం సాధించారు.

రెవిన్యూ మంత్రిగా ఏడాది పాటు తన పని సంతృప్తిని ఇచ్చిందని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఏడాది పాటు తన విధుల్లో సీఎం ఏనాడూ కూడ జోక్యం చేసుకోలేదని ఆయన వివరించారు. 

పార్లమెంట్ కు వెళ్లాలనేది తన చిరకాల వాంఛ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాకు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం జగన్ సుధీర్ఘ కాలం పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. 

ప్రత్యేక హోదా రావడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీలంతా పార్టీకి విధేయులుగా ఉండాలన్నారు. పార్టీ నాయకత్వం చెప్పిన ప్రకారంగా నడుచుకోవాలని ఆయన సూచించారు.