తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద ఆయనపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు వంగా వెంకట్రామిరెడ్డి, లాయర్ పోనక జనార్థన్ రెడ్డి కోర్టును కోరారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో వచ్చిన చంద్రబాబు మార్గమధ్యంలో పలు చోట్ల జనసమీకరణ, బైక్ ర్యాలీలతో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని వారు పేర్కొన్నారు. రాజకీయపరమైన ర్యాలీలపై నిషేధం వున్నప్పటికీ.. ప్రతిపక్షనేత ఆ విషయాన్ని పట్టించుకోలేదని వారు పిటిషన్‌లో తెలిపారు.

Also Read:చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, నేడే జగన్ తో భేటీ

భౌతిక దూరం పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి జరిగేలా చంద్రబాబు వ్యవహరించారని చెప్పారు.  అందువల్ల ప్రతిపక్షనేతకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసి, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పిటిషన్లు కోరారు.

కాగా రెండు నెలల లాక్‌డౌన్ విరామం తర్వాత చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతిలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీ డీజీపీ అనుమతి మేరకు చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేశ్‌లు హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు.

Also Read:రెండు నెలల తర్వాత అమరావతికి చంద్రబాబు.. తొలిరోజే వైసీపీ షాక్

అయితే తమ అభిమాన నేతకు స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు మార్గమధ్యంలో పెద్ద సంఖ్యలో గుమిగూడటం విమర్శలకు తావిచ్చింది.