అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి ప్రతిపక్ష హోదాను గల్లంతు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దానివల్ల టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాను కోల్పోతారు. వైసీపీలో చేరేందుకు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. 

ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి వంటి ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకుకోకుండానే వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. కరణం బలరాం కూడా వైసీపీకి చేరువయ్యారు. మరింత మంది తెలుగుదేశం పార్టీని వీడిే భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా గల్లంతవుతోంది. ఆ దిశగా రాజకీయాలు వేగంగా మారుతున్నట్లు తెలుస్తోంది. 

టీడీపీ అధిష్టానం మీద నమ్మకం లేని నేతలు కొందరు, అధిష్టాన వైఖరి నచ్చని వారు కొందరు ఇలా ఒక్కొక్కరు గా పార్టీని వీడటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. కాగా తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యే లు పార్టీని వీడడానికి సిద్దమైనట్లు సమాచారం. పర్చూరు నియోజక వర్గ ఎమ్మెల్యే సాంబశివ రావు ,రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌ టీడీపీ ని వదిలి,అధికార వైసీపీ పార్టీ లో చేరడానికి సిద్ధమయ్యారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఈ మేరకు వారు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుసుకొని పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇప్పటికే ఎమ్మెల్యేలతో మంత్రి బాలినేని, పార్టీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు చర్చలు జరిపినట్లు సమాచారం.