అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్‌ పెన్మత్స సూర్యనారాయణ రాజు(సురేష్‌ బాబు)కు  బీ ఫారమ్‌ అందజేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విజయనగరం జిల్లాకు చెందిన మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, వైయస్సార్సీపీ  జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావులు సమక్షంలో సురేష్‌ బాబు భీఫారం అందచేశారు ముఖ్యమంత్రి జగన్. 

ఇటీవలే మృతిచెందిన వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరావరాజు కుమారుడిని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వైసిపి నిర్ణయించింది. తొలుత ఈ టికెట్‌ను మర్రి రాజశేఖర్‌కు ఇవ్వాలని జగన్ భావించారు. అయితే సాంబశివరాజు మరణంతో చివరి నిమిషంలో పేరు మార్చారు ముఖ్యమంత్రి. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది.

read more   సీనియర్ వైసిపి నేత మృతి... సంతాపం వ్యక్తంచేసిన సీఎం జగన్

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరావరాజు అనారోగ్యంతో విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణకు ఆయన రాజకీయ గురువు.

సాంబశివరాజు రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1989-94 మధ్య ఆయన మంత్రిగా పనిచేశారు. 1958లో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

గజపతినగరం, సితవాడ శాసనసభా స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలచారు. అయితే, 1994లో పరాజయం పాలయ్యారు. సుదీర్ఘ కాలం ఆయన కాంగ్రెసు పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు.