అమరావతి: రాజకీయ కురువృద్ధులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  భగవంతుడ్ని ప్రార్థించారు. 

దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు పెన్మత్స సాంబశివరాజు అని ముఖ్యమంత్రి కొనియాడారు.  పెన్మత్స మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. పెన్మత్స కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేవుడు ఆ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని జగన్ ఆకాంక్షించారు.

మాజీ మంత్రి పెనుమత్స గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం విజయనగరంలోనే కాదు రాష్ట్రస్థాయి సీనియర్ నాయకుల్లో ఒకరు, మంత్రి బొత్స సత్యనారాయణకు రాజకీయ గురువు.

విజయనగరం: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సాంబశివరాజు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్ను మూశారు. ఆయనను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ పెనుమత్సను తన గురువుగా భావిస్తారు. 

సాంబశివరాజు రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1989-94 మధ్య ఆయన మంత్రిగా పనిచేశారు. 1958లో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

గజపతినగరం, సితవాడ శాసనసభా స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలచారు. అయితే, 1994లో పరాజయం పాలయ్యారు. సుదీర్ఘ కాలం ఆయన కాంగ్రెసు పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు.