చంద్రబాబును కలిసిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆయనపై పోలీసులు పెట్టిన కేసు గురించి వివరణ తనకు సాయం కాదు... న్యాయం కావాలన్న ఎమ్మెల్యే
విశాఖ జిల్లాలో బయటపడ్డ భూ కుంభకోణంలో అబియోగం ఎదుర్కొంటున్న అధికార పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. రామవరం భూముల వ్యవహారంలో అతడి హస్తం ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం పెట్టిన కేసు గురించి చంద్రబాబుకు వివరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన భూములను ఆక్రమించాడని సిట్ బృందం బయటపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో పార్టీ పరువు తీసిన ఆయనపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నాడన్న వార్తల నేపథ్యంలో సీఎంను కలవడం ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం పీలా మీడియాతో మాట్లాడుతూ.. తనకున్న స్థిరాస్తులు, భూములు అన్ని తన తండ్రి పీలా మహలక్ష్మినాయుడు ద్వారా సంక్రమించాయని తెలిపాడు. అవన్ని తనకు వారసత్వంగా వచ్చాయే గాని తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించానని, తనకు సాయం కాదు... న్యాయం చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూములను స్వాధీనం చేసుకున్నానని సిట్ బృందం నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీలా స్పష్టం చేశారు. సిట్‌కు 3 వేల ఫిర్యాదులు వస్తే కేవలం తన విషయంలోనే వారు అతిగా స్పందించి కేసు పెట్టారని ఆరోపించారు. తనను భూ కుంభకోణంలో బలిపశువును చేసే కుట్ర జరుగుతోందని, తనకు న్యాయం చేయాలనే ముఖ్యమంత్రిని కలిశానన్నారు.
అయితే ఈ కేసును పరిశీలిస్తున్న డీఐజీ వినీత్‌బ్రిజ్‌పాల్ మాట్లాడుతూ,తాము ఎవరిని టార్గేట్ చేయడం లేదని నిస్పక్షపాతంగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు ఎంతవారైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
