అనంతపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న చిరంజీవి పార్టీని అమ్ముకుని పోతే అన్న బాటలో నడిచేందుకే  అన్నట్లుగా పవన్ వచ్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు పవన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు.

ఒకప్పుడు తన సిధ్ధాంతాలు సరైనవని, నేడు తననే మొసగాడంటున్నాడని మండిపడ్డారు. పవన్ ఓ ఊసరవెళ్ళి అంటూ చంద్రబాబు అభివర్ణించారు. ప్రజలను మోసం చేసి, టోపీలు వేయడానికి అటు వైసీపీ, ఇటు జనసేన పార్టీలు వచ్చాయని తస్మాత్ జాగ్రత్త అంటూ బాబు హెచ్చరించారు. 

జగన్ కోడి కత్తి అంతా ఓ డ్రామా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీఎం మోదీని ఎదిరించి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నానని ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా  ఎదుర్కోవడానికి తాను సిధ్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

న్యాయంగా పనిచేస్తుంటే తమపై సీబీఐ దాడులు జరపడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీని గెలిపించడానికి సిధ్ధంగా ఉండమని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
మరోవైపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న నాయకులకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏదైనా అన్యాయం చేస్తే చూస్తు ఊరుకోనని హెచ్చరించారు. 

ప్రతి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థి పేరు చెబుతానని వాళ్ళను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు తెలిపారు. అన్నీ చేశాం, చేస్తున్నాం మళ్ళీ పార్టిని గెలిపించే హక్కు మీకు లేదా అని కార్యకర్తలకు హితబోధ చేశారు. 

అనంతపురం జిల్లాలో 14 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలూ కచ్చితంగా గెలిపించాలని చంద్రబాబు కోరారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, 175 శాసనసభ స్థానాలు గెలుస్తామని బాబు ధీమా వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ నన్నే ఎందుకు తిడతారో అర్థం కావడం లేదు:చంద్రబాబు ఆవేదన