అనంతపురం: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రతీరోజూ తెలుగుదేశం పార్టీని తనను తిడుతున్నారని అది సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు కేసీఆర్ తనను ఎందుకు రోజూ తిడతారో అర్థం కావడం లేదన్నారు.

హైటెక్ సిటీని కట్టించినందుకా..హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపినందుకా అని ప్రశ్నించారు. ఓ గొప్ప హైదరాబాద్ నగరాన్ని తెలుగుజాతి కోసం ఇష్తే సరిగ్గా పాలించకుండా తనను విమర్శించడం ఏంటని నిలదీశారు. 

తనను విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ టీడీపీని విమర్శిస్తూ ప్రధాని మోదీతో లాలూచీ పడుతున్నారని విమర్శించారు. అందువల్లే తాము తెలంగాణలోని ప్రజాకూటమిలో చేరామని స్పష్టం చేశారు. కేసీఆర్ మోదీతో లాలూచీ అయ్యారని అది నిజమన్నారు.  

మరోవైపు తెలంగాణలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలపై చంద్రబాబు స్పందించారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని, ఎక్కువ ఆదాయం ఉందని అన్నారు. ఏపీ ఆదాయం తక్కువగా ఉందని, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. 

రాష్ట్రంలో పరిశ్రమల ద్వారా 30లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. నాలుగున్నరేళ్లలో 16లక్షల కోట్లతో ఎంఓయూలు కుదుర్చుకున్నామని వివరించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషిచేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

సులభతర వాణిజ్యం, నైపుణ్య శిక్షణలో అగ్రస్థానంలో ఉన్నామని, విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో 25వేల కిలోమీటర్ల మేర సిమెంట్‌ రోడ్లు వేశామని అలాగే జిల్లాలో వంద శాతం గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో వినూత్నంగా వీధి దీపాలు ఏర్పాటుచేశామని చంద్రబాబు చెప్పారు.