మెల్లిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముసుగులో నుండి బయటపడుతున్నారు. పొత్తులపై తాజాగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. చలోరే చలోరే చల్‌ యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే బ్రేక్ పాస్ట్ చేశారు. తర్వాత అనంతపురం జిల్లా సమస్యలపై చర్చించారు. పరిటాల ఇంటకి పవన్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. పరిటాల ఇంటికి పవన్ చేరుకోగానే స్వయంగా పరిటాల శ్రీరామ్ బయటకు వచ్చి రిసీవ్ చేసుకున్నారు.  

టిఫిన్ తర్వాత పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ దివంగత పరిటాల రవితో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు.  టీడీపీ-జనసేన పొత్తు, సీమకు పొంచి ఉన్న ప్రమాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాభీష్టం మేరకు, ప్రజలు కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

అభివృద్ధిపై మాట్లాడుతూ ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏపీ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తానన్నారు. వెనుకబాటుకు గురైన రాయలసీమను సత్వరం అభివృద్ధి చేయకపోతే ప్రాంతీయవాదం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. 2019 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చెయ్యబోయేది ఇంకా నిర్ణయించుకోలేదని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు. ఒకపుడు అనంతపురం నుండే పోటీ చేస్తానని చెప్పిన విషయం బహుశా మరచిపోయారేమో?

తాను ఎవరికీ తొత్తు కాదన్న పవన్‌ సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేస్తున్నట్లు చెప్పుకున్నారు. అయితే బీజేపీతో పొత్తుపై సీఎం చంద్రబాబు తాజా వ్యాఖ్యల అనంతరం టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా పవన్‌తో భేటీలకు సిద్ధం అవుతుండటం జిల్లాల్లో చర్చనీయాంశమైంది. శనివారం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో ప్రత్యేక భేటీ జరిపిన ఆయన ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటిలో బ్రేక్ ఫాస్ట్ కు వచ్చారు. రాబోయే రోజుల్లో మరికొందరు టీడీపీ కీలక నేతలు కూడా పవన్‌ను కలిసే అవకాశాలున్నాయని సమాచారం.