ఎంపీ రఘురామకృష్ణం రాజుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  పవన్ కి.. రఘురామ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఆయన విషెస్ కి రిప్లై ఇచ్చిన పవన్.. రఘురామ పై ప్రశంసలు కురిపించారు.

పుట్టినరోజున విష్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన పవన్.. దేవాలయాలు, హెరిటేజ్ సంపదనను కాపాడేందుకు మీరు పడుతున్న శ్రమకు అభినందనలని రఘురామకృష్ణ రాజును ఉద్దేశించి పవన్ ట్వీట్ చేశారు.

టీటీడీ ఆస్తులను అమ్మాలని వైసీపీ సర్కార్ భావించిన సందర్భంలో.. తిరుమలేశుడి భక్తులు కానుకగా ఇచ్చిన భూములు విక్రయిస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో.. భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడంతో వైసీపీ సర్కార్ టీటీడీ ఆస్తుల విక్రయంపై వెనక్కి తగ్గింది.

‘టీటీడీ ఆస్తుల విక్రయంపై భక్తుల మనోభావాలకు అనుగుణంగా బహిరంగంగా మాట్లాడాను. మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని సూచించడం తప్పెలా అవుతుంది? నేను క్రైస్తవ మతానికి వ్యతిరేకమంటూ మీ (జగన్‌) చుట్టూ ఉన్న కొందరు ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే పార్టీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా.. కులం, మతం, వర్గం, వర్ణం, సంప్రదాయాలన్నిటినీ గౌరవిస్తాను. ఇదే సందర్భంలో తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన భూములు, ఆస్తులు విక్రయిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని భావించాను. ఇది క్రైస్తవ మతానికి వ్యతిరేకమెలా అవుతుంది?’ అని సీఎం జగన్‌కు రఘురామకృష్ణంరాజు ఆ సందర్భంలో లేఖ కూడా రాశారు.