పవన్..ఓ ‘అపరిచుతుడే’ నా ?

First Published 8, Dec 2017, 5:00 PM IST
pawan lacks consistency in his speeches and forgets whatever he says next moment
Highlights
  • జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగం విన్న తర్వాత అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగం విన్న తర్వాత అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ‘అపరిచితుడు’ క్యారెక్టర్ ఏమైనా పవన్ కల్యాణ్ లోకి ప్రవేశించాడా అని. ఎందుకంటే, గురువారం పవన్ మాట్లాడిన మాటలకు, శుక్రవారం మాట్లాడిన మాటలు చూస్తే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి మరి. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడితే ఏదో అమాయకుడనో లేకపోతే ఇంకోటనో సరిపెట్టుకుంటారు. అంతేకానీ రెండు రోజుల్లో పరస్పర విరుద్దమైన మాటలు మాట్లాడుతుంటే అపరచితుడనే అంటున్నారు ఈమధ్య. పవన్ కూడా అదే కోవలోకి చేరాడా అన్న అనుమానలు మొదలయ్యాయి.

ఇంతకీ గురువారం ఏం మాట్లాడాడు? తన అన్న చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ ఏర్పాటు చేసినపుడు కొందరు స్వార్ధపరుల వల్లే దెబ్బతిన్నట్లు చెప్పారు. అటువంటి వారిని పేరు పేరునా గుర్తుపెట్టుకుంటానని, సమయం వచ్చినపుడు వారికి చెప్పుతోకొట్టినట్లుగా సమాధానం చెబుతానని అన్నారు. అన్నకు జరిగిన ద్రోహాన్ని తాను ఎప్పటికీ మరచిపోనన్నారు. అప్పట్లో తాను గనుక తన అన్న పక్కనే ఉండుంటే అటువంటి వాళ్ళ పరిస్ధతి వేరే విధంగా ఉండేదంటూ పరకాల ప్రభాకర్ ను హెచ్చరించారు. చిరంజీవికి వారు చేసిన ద్రోహాన్ని మరచిపోలేదని, కడపులోను, గుండెల్లో మండిపోతోందని చెప్పారు. అటువంటి వారిలో ఒకరు అంటూ పరకాల ప్రభాకర్ అనే పేరును పదే పదే ప్రస్తావించారు. పవన్ మాటలను ఏ విధంగా అర్ధం చేసుకోవాలి?  

మరి అదే పవన్ శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ తానో పెద్ద వేదాంతిని అన్నట్లు ఫోజు కొట్టారు. తనను ఎంత బాధపెట్టినా మనసులో పెట్టుకోనని చెప్పారు. ఒకపుడు తనను బాగా ఇబ్బంది పెట్టిన టిడిపికే 2014 ఎన్నికల్లో మద్దతు ఇవ్వటమే అందుకు నిదర్శనంగా చెప్పుకున్నారు. దాంతో పాటు సంబంధంలేని అనేక విషయాలను ప్రస్తావించారు. ఎప్పుడో జరిగిన వంగవీటి రంగా హత్యను ప్రస్తావించారు. కృష్ణా-గుంటూరు జిల్లాలకు రాజధాని స్ధాయి లేదన్నారు. ఏపిలో కులాభిమానం(పిచ్చి) చాలా ఎక్కువన్నారు. కులాలకు అతీతంగా రాజకీయాలుండాలన్నారు. పార్టీలు విభజించి, పాలించు సిద్దాంతాలను పాటిస్తున్నట్లు మండిపడ్డారు.

పోయిన ఎన్నికల సమయంలోనే జగన్ పై అభియోగాలు, కేసులు లేకపోయుంటే జగన్ కే మద్దతు ఇచ్చేవాడినేమో అన్నట్లుగా చెప్పారు. దాంతో వచ్చే ఎన్నికల్లోగా జగన్ పై కేసులను కొట్టేస్తే అప్పుడు జగన్ కు పవన్ మద్దతు ఇస్తారా అన్న అనుమానం మొదలైంది. చంద్రబాబునాయుడును చూసి పోయిన ఎన్నికల్లో టిడిపికి మద్దతు ఇవ్వలేదట. అన్నీ కులాలను కలుపుకుని పోయేట్లుగా అమరావతిని తీర్చి దిద్దుతారనే చంద్రబాబుకు మద్దతు ఇచ్చారట.

అయితే, పవన్ ఇక్కడ ఓ విషయం మరచిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాజధానిగా అమరావతి తెరపైకి వచ్చింది. ఇలా...సంబంధం లేని అనేక అంశాలను కలగాపులగంగా మాట్లాడేసి మొత్తానికి పవన్ సమావేశం అయిపోయిందనిపించారు.

 

loader